CM Revanth Reddy: మోదీ వద్దకు.. కేసీఆర్ వెళ్లింది అందుకే..
ABN , Publish Date - Feb 09 , 2024 | 04:09 PM
బీఆర్ఎస్, బీజేపీ స్నేహాంపై అసెంబ్లీలో శుక్రవారం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ
హైదరాబాద్: కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ స్నేహాంపై అసెంబ్లీలో శుక్రవారం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సొంత పార్టీ నేతలకు కూడా ముఖ్యమైన విషయాలు చెప్పరన్నారు. బీఆర్ఎస్ నేతలకు అనుమానం ఉంటే.. తన దగ్గరకు వచ్చి కలిస్తే అన్ని వివరిస్తానని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కొంత మంది మంత్రులు అవిశ్వాసం ప్రకటించి.. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూశారన్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీ దగ్గరకు వెళ్లి కేటీఆర్‌ను సీఎం చేస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరారని తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. మోదీ తీసుకువచ్చిన చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. శాసనమండలి సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభా మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి.. సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడటం సరికాదన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. దీంతో సభను శాసనమండలి చైర్మన్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు.