CM Revanth Reddy: ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
ABN , Publish Date - Aug 17 , 2024 | 03:15 AM
సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
పీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులపై చర్చ
రేవంత్‌రెడ్డిని కలిసిన అభిషేక్ సింఘ్వీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. దాదాపు గంటకుపైగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు తెలిసింది. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అంశంతోపాటు తన విదేశీపర్యటన గురించి ఖర్గేకు రేవంత్ వివరించినట్లు సమాచారం. వరంగల్‌లో జరిగే రైతు రుణమాఫీ సభకు సంబంధించి సోనియా, రాహుల్‌గాంధీ రాకపై చర్చించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ అంశాన్ని కూడా ఖర్గే దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్ష నియమాకంతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు.. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన అభిషేక్ మను సింఘ్వీ.. రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. క్యాబినెట్ విస్తరణపై చర్చించేందుకే తాను ఢిల్లీకి వచ్చానన్న వార్తలను సీఎం రేవంత్ ఖండించారు.
క్యాబినెట్ విస్తరణ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. తాను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో భేటీ కోసమే ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. క్యాబినెట్ విస్తరణపై చర్చించేందుకు వస్తే కీలక నేతలు కూడా వచ్చేవారు కదా! అని వ్యాఖ్యానించారు. కాగా, రాత్రి 10 గంటలకు సీఎం రేవంత్ హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నీతి నిజాయితీలకు ప్రతిరూపమని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.