CM Revanth Reddy: మహిళ చనిపోతే కేసు పెట్టరా?
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:53 AM
‘‘అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి?
ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే ఇంతలా ప్రశ్నిస్తున్నారు?
తల్లి చనిపోయింది.. చావుబతుకుల మధ్య పిల్లాడు
ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించారా?
ప్రభుత్వం, పోలీసులు ఏం చేయాలో చెప్పండి?
అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి చేతులు ఊపారు
ఆ తర్వాతే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది
హంగామా చేయకుంటే ఈ గొడవే ఉండేదికాదు
ఆయన మామ చిరంజీవి, పిల్లనిచ్చిన మామ
కాంగ్రెసోళ్లే.. అర్జున్ భార్య వాళ్లు మా బంధువులే
ఇండియా టుడే చర్చా వేదికలో సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా? మరి ఒక మహిళ ప్రాణం పోయింది. దానిపై ఒక్క ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి? మృత్యువుతో పోరాడుతున్న 9 ఏళ్ల పిల్లాడి పరిస్థితి ఏంటి? ఆస్పత్రి నుంచి బయటికొచ్చాక తల్లి లేకుండా ఎలా బతుకుతాడు? ఇలాంటివాటి గురించి మీరు ఆలోచించడం లేదు కదా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హీరోకి సినిమా ఒక వ్యాపారమని, డబ్బులు పెట్టి.. డబ్బులు సంపాదించుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి, అమ్ముకుని డబ్బులు సంపాదించుకుంటారని తెలిపారు. అంతేకానీ, ‘‘వాళ్లేమైనా పాకిస్థాన్ బార్డర్‌కు వెళ్లి దేశం కోసం యుద్ధం గెలిచి వచ్చారా? సినిమా తీశారు. పైసలు సంపాదించారు’’ అని చెప్పారు. దీంట్లో ‘మీకు, మాకు ఏం వస్తుంది?’ అని రేవంత్ ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ చర్చా వేదికలో అల్లు అర్జున్ అరెస్టుపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధానికైనా, సామాన్యుడికైనా ఒకే చట్టమని స్పష్టం చేశారు. రాజ్యాంగంతో చెలగాటమాడితే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పుష్ప-2 సినిమా విడుదల రోజు ముందస్తు ప్రదర్శన (బెనిఫిట్ షో)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ ప్రదర్శనకు రూ.300 టికెట్‌ను రూ.1300కు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఆ ప్రదర్శన సమయంలో థియేటర్ వద్ద ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండానే హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు 13 రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
ఈ ఘటనలో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతోపాటు పలువురిని అరెస్టు చేశారు. పదిరోజుల తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్లారు. అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదంతా చట్ట ప్రకారమే జరిగింది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదంతా పక్కన పెడితే, ఆ ఘటనలో ఒక నిండు ప్రాణం పోయిందని గుర్తించాలన్నారు. ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టకపోతే ప్రజలెలా ఊరుకుంటారని ప్రశ్నించారు. తమ పాలనలో సినిమా హీరోకు ఒక రాజ్యాంగం, సామాన్యుడికి మరో రాజ్యాంగం.. అనే చర్చ మొదలవుతుందని చెప్పారు. నేరం చేసిందెవరన్నదే ముఖ్యమని, వాళ్లు సినిమా హీరోలా? రాజకీయా నేతలా? అన్నది తమకు అనవసరమని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. ‘‘అల్లు అర్జున్ కారులో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి వెళ్లిపోతే సమస్యే ఉండేది కాదు. అలా కాకుండా కారెక్కి అభివాదాలు చేస్తూ, అభిమానుల్లో గందరగోళం సృష్టించారు. దీనివల్లే అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌ను ఈ కేసులో ఏ11గా పేర్కొన్నారు. అయినా ఒక మహిళ మరణానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? తొమ్మిదేళ్ల బాబు చావు బతుకులతో పోరాడుతున్నాడు. ఇందులో ప్రభుత్వం, పోలీసుల బాధ్యత ఏదో మీరే చెప్పండి. ఇది అల్లు అర్జున్ చిత్రం. ఆయన కావాలంటే స్టూడియోలో లేదా ఇంట్లో ప్రతేక ప్రదర్శన వేయించుకొని చూడొచ్చు. అలాకాకుండా ప్రజల్లోకి వెళ్లి చూడాలంటే పోలీసులకు సమాచారమివ్వాలి. ఎలాంటి సమాచారం లేకుండా నేను ఏదైనా కార్యక్రమానికి హాజరైతే, అక్కడ ఏమైనా జరిగితే.. నాపైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది’’ అని రేవంత్ అన్నారు.
చిన్నప్పటి నుంచే తెలుసు..
అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచే తెలుసని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆయన మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత అని, అర్జున్‌కు పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్‌రెడ్డిది కూడా కాంగ్రెస్ కుటుంబమేనని గుర్తుచేశారు. చంద్రశేఖర్‌రెడ్డి తరఫున అల్లు అర్జున్ తనకు బంధువే అవుతారన్నారు. అయినప్పటికీ చుట్టరికం, బంధాలతో పట్టింపు లేదని, ఈ వ్యవహారంలో పోలీసులు చట్టాన్ని అమలు చేశారని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ చట్ట ప్రకారం ఎవరైనా ఆందోళనలు చేయొచ్చని, అయితే అనుమతి లేకుండా ఆందోళనకు దిగితే జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. మీడియా సమావేశంలో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు మరిచిపోయారనే అరెస్టు చేశారంటూ వార్తలు వస్తున్నాయని అడగ్గా.. అవన్నీ ఊహాగానాలేనని రేవంత్ పేర్కొన్నారు. అలాగే, తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానినని, ఆయనిప్పుడు లేరని రేవంత్ చెప్పారు. ఇప్పుడు ఉన్నవాళ్లలో ఏ హీరో అంటే ఇష్టమని యాంకర్ అడగ్గా.. తానే ఒక స్టార్ అని, స్వయంగా స్టార్‌గా ఎదిగానని బదులిచ్చారు.
అప్పుడు రాజుల తల్లి.. ఇప్పుడు కిసాన్ తల్లి..
‘‘బీఆర్‌ఎస్ హయాంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం రాజుల తల్లిలా ఉండేది. మేం ఆవిష్కరించిన విగ్రహం రైతుల తల్లి. మేం రైతు బిడ్డలం కాబట్టి కిసాన్ తల్లిని రూపొందించుకున్నాం’’ అని రేవంత్ తెలిపారు. విగ్రహంలోని చెయ్యి.. కాంగ్రెస్ గుర్తును పోలి ఉందన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. భారత మాత చిత్రం, గౌతమ బుద్ధ, షిరిడీ సాయి విగ్రహాల్లోనూ చెయ్యి ఇలాగే ఉంటుందని గుర్తుచేశారు. రాజ్యాంగం, సామాన్య ప్రజలతో పెట్టుకుంటే కచ్చితంగా జైలుకు పంపిస్తామని పునరుద్ఘాటించారు.
రుణమాఫీని ఏ రాష్ట్రంలో చేశారో చెప్పండి
ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ గ్యారెంటీ ఏమైందని రేవంత్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు అవుతున్నా ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని నిలదీశారు. కానీ, తమ సర్కారు ఏడాదిలోనే అనేక హామీలు అమలు చేసిందన్నారు. కేవలం 10 నెలల్లోనే 25,35,000 మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలా చేశారా? అని నిలదీశారు. ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రూ.4వేల కోట్లు చెల్లించిందని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సుతో మెట్రోకు నష్టం వాటిల్లుతుందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో మెట్రో సీ ఎఫ్‌వో రాజకీయ ప్రేరేపిత ప్రకటన చేశారన్నారు. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించారని తెలిపారు. అం దుకే ఆయన్ని అరెస్ట్ చేయాలని ఆదేశించామని గుర్తుచేశారు. ఆయన ముంబై పారిపోయారన్నారు.
ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అందించాం..
తెలంగాణ ప్రజలకు ఏడాది పాలనలోనే ఆరు గ్యారెంటీలతోపాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అందించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇదే బీఆర్‌ఎ్‌సకు, తమకు ఉన్న తేడా అని వివరించారు. ‘‘కేసీఆర్ హయాంలో ప్రజా భవన్‌ని గడీగా మార్చా రు. నేను ప్రమాణం చేసిన వెంటనే గడీ గేట్లను బద్దలు కొట్టాను. రోజుకు 1000 మంది తమ గోడును చెప్పుకొంటున్నారు. కేసీఆర్ పదేళ్లలో 10 సార్లు కూడా సచివాలయానికి రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు దశలవారీగా జీతాలిచ్చారు. కానీ మేం ఒకటో తేదీనే జీతాలిస్తున్నాం. రాష్ట్రంలో కోల్పోయిన ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తిరిగి తెచ్చాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వపు మొదటి విజయం. వైబ్రెంట్ గుజరాత్‌కు పోటీగా రైజింగ్ తెలంగాణ పేరుతో కౌంటర్ ప్రాడక్ట్‌ను సిద్ధం చేశాం. ఏడాదిలోగా గుజరాత్‌ను వెనక్కి నెట్టి, రైజింగ్ తెలంగాణను ముందుకు తీసుకెళతాం. మా అధినేత రాహుల్‌దీ, నాదీ ఒకటే లైన్. అర్థం చేసుకోవడంలోనే ఇబ్బంది ఉంది. అదానీ, బిర్లా ఎవరైనా పోరాడే గ్రౌండ్ ఒక్కటే ఉండాలి. అందరికీ సమాన అవకాశాలు ఉండాలన్నదే మా లక్ష్యం. ముంబై విమానాశ్రయాన్ని తెలుగు రాష్ట్రాలకు చెందిన జీవీకే కంపెనీ నిర్మించింది. కానీ, ఈడీ, ఐటీ, సీబీఐ జీవీకేపై దాడులు చేసి కేసులు పెట్టాయి. ముంబై విమానాశ్రయం అదానీకి అప్పగించగానే ఆ కేసులన్నీ మాఫీ అయ్యాయి. నిజంగా అమెరికా ఆరోపణల్లో నిజం లేకపోతే అదానీ ముడుపుల వ్యవహారంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు’’ అని రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణకు నేను బాధ్యుడిని.. దేశానికి కాదు కదా?
తెలంగాణకు మాత్రమే తాను బాధ్యుడినని, హరియాణా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి గురించి ఆ రాష్ట్ర నేతల్ని అడగాలని రేవంత్ సూచించారు. ‘ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ అధినేత రాహుల్ వద్ద మాట్లాడతాను తప్ప ఈ రాహుల్ దగ్గర మాట్లాడను’ అంటూ నవ్వులు పూయించారు. ఎన్నికల్లో ఓటమిపై రాహుల్‌తో పోస్ట్‌మార్టం చేస్తే బాగుంటుంది తప్ప ఆజ్‌తక్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్‌తో పంచనామా ఏం బాగుంటుంది? అని వ్యాఖ్యానించారు. దేశం, రైతుల కోసం బీజేపీ అజెండా ఏమిటో ప్రజల ముందు ఉంచాలన్నారు. బీజేపీ చెప్పేదానికి, చేసేదానికి సంబంధం ఉండదని, దాన్ని ప్రజలకు వివరించడం వల్లే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సాధ్యమైందని వివరించారు. ‘‘నా కంటే ముందు ఇదే సీట్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కూర్చున్నారని చెప్పారు కదా? ఆయన మూడుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 750మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరణించిన వారి కుటుంబాలను కలవడానికి కూడా మోదీ ప్రయత్నించలేదు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించేసి.. క్షమాపణల పేరుతో ఓట్లు అడుక్కున్నారు. కేంద్ర మంత్రి కొడుకు ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి వాహనం ఎక్కించి హత్య చేశాడు. ఇప్పుడా కేసు ఏమైంది? ఇదీ.. అసలైన బీజేపీ రంగు, ముఖం. ఇదంతా ప్రజలకు తెలియజేస్తే చాలు. వారే ఆ పార్టీని ఓడిస్తారు’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆర్‌ఆర్ ట్యాక్స్‌పై ఆధారం ఉందా
రాహుల్, రేవంత్ ట్యాక్స్ (ఆర్‌ఆర్ ట్యాక్స్) పేరుతో ఆరోపణలు చేస్తున్న నరేంద్ర మోదీ, దీనికి సంబంధించి ఒక్క ఆధారం ఉన్నా చూపాలని డిమాండ్ చేశారు. మోదీ బీజేపీ నాయకుడిగా ఇలాంటి ఆరోపణలు చేస్తే పర్వాలేదని, దేశ ప్రధానిగా ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
మంత్రివర్గ విస్తరణపై చర్చలేమీ లేవు: రేవంత్
చట్టం ముందు అందరూ సమానులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్లిన సీఎంను మీడియా ప్రతినిధులు కలిశారు. అల్లు అర్జున్ అరెస్టు, ఇతర ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందులో నా జోక్యమేమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. తొక్కిసలాటలో ఒకరు చనిపోయినందునే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మోహన్‌బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులున్నాయి కదా? పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళతారు. ఓవైపు పార్లమెంట్, మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై చర్చలేమీ లేవు. అభివృద్థి, సంక్షేమంపైనే ఎక్కువ దృష్టి. క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి, ముఖ్యనేతలతో చర్చలు జరగాలి కదా?’’ అని రేవంత్ అన్నారు.