Investments: 8 నెలల్లో రూ.76 వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:47 AM
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
అమెరికా, కొరియా నుంచి రూ.36 వేల కోట్లు.. జనవరి పర్యటనలో రూ.40 వేల కోట్లు
రాష్ట్రానికి వచ్చేందుకు విదేశీ కంపెనీల ఆసక్తి
రికార్డుస్థాయిలో ఒప్పందాలు: సీఎంవో
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. సీఎం రేవంత్ తాజాగా నిర్వహించిన అమెరికా పర్యటన ద్వారా రూ.31,502 కోట్లు, దక్షిణా కొరియా పర్యటన ద్వారా రూ.4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, మొత్తం 25 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. వీటి ఫలితంగా తెలంగాణలో వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సంస్థ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో సీఎం రేవంత్ రూ.40,232 కోట్ల పెట్టుబడులను సమీకరించారని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే మొత్తం రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించడం ఒక రికార్డు అని తెలిపింది. దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ బృందం అటోమోటివ్, ఎలక్ర్టానిక్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్ టైల్ రంగాలపై దృష్టి సారించింది.
పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. దీంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి మంచి స్పందన లభించింది. హ్యుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యంగ్‌వన్ కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో కాస్మటిక్ తయారీకి ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
ఫార్మా కంపెనీ డాంగ్‌బ్యాంగ్ రూ.200 కోట్లతో ఒక తయారీ కేంద్రాన్ని, జేఐ టెక్ కంపెనీ ఎల్‌ఈడీ మెరిటీరియల్ తయారీ ప్లాంట్‌తోపాటు ఆర్ అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.వంద కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో ఈవీ ఛార్జింగ్ ఇన్ ఫ్రాని తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చావి అనే కంపెనీ తెలిపింది. ఎల్‌ఎస్ గ్రూప్, పోస్కో, ఎల్జీ, సామ్‌సంగ్, క్రాఫ్టన్, యూయూ ఫార్మా, జీఎస్ కాల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ తరహాలో రాష్ట్రంలోనూ స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సీఎంవో వివరించింది.