Share News

CM Revanth Reddy: సార్‌.. సిబ్బంది కావాలి.

ABN , Publish Date - May 28 , 2024 | 04:52 AM

పురపాలక శాఖ పరిధిలోని పలు విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీని వల్ల డిప్యుటేషన్లపై ఆధారపడి పనులు చేయాల్సిన పరిస్థితి. పురపాలక శాఖ సంచాలకుల పరిధి(సీడీఎంఏ), హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు, మూసీ అభివృద్ధి మండలి, హెచ్‌ఎండీఏ, టౌన్‌ ప్లానింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, రెరా విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు ఆయా విభాగాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

CM Revanth Reddy: సార్‌.. సిబ్బంది కావాలి.

  • సీఎం వద్ద పురపాలక అధికారుల ప్రతిపాదన

  • 4 వేల మంది వరకు అవసరమవుతారని వినతి

  • 30న జరిగే సమావేశంలో చర్చిద్దామన్న రేవంత్‌

హైదరాబాద్‌, మే 27(ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖ పరిధిలోని పలు విభాగాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. దీని వల్ల డిప్యుటేషన్లపై ఆధారపడి పనులు చేయాల్సిన పరిస్థితి. పురపాలక శాఖ సంచాలకుల పరిధి(సీడీఎంఏ), హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు, మూసీ అభివృద్ధి మండలి, హెచ్‌ఎండీఏ, టౌన్‌ ప్లానింగ్‌, పబ్లిక్‌ హెల్త్‌, రెరా విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు ఆయా విభాగాల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన పురపాలక శాఖ అధికారుల సమావేశంలో విభాగాల వారీగా అదనపు సిబ్బంది అవసరంపై ప్రతిపాదనలు చేశారు. అయితే దీనిపై ఈ నెల 30న నిర్వహించే సమావేశంలో చర్చిద్దామని సీఎం అధికారులకు సూచించినట్లు తెలిసింది. పురపాలక శాఖ సంచాలకులు దివ్యా దేవరాజన్‌ తన పరిధిలో గతంలో కొత్తగా ఏర్పడిన 85 మునిసిపాలిటీలకు సుమారు 2,000 మందికిపైగా సిబ్బంది కావాలని అడిగారని సమాచారం.


హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ ఎండీ సుదర్శన్‌ రెడ్డి తనకు 200 మంది వరకు అదనపు సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధి పెరగడంతో పాటు పనులు పెరిగాయి. దీంతో గతంలో కేటాయించిన సిబ్బంది సరిపోని పరిస్థితి. వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌ మీద తీసుకుని తాత్కాలికంగా పనులు చేయిస్తున్నారు. ఇటీవల మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించి అదనపు సిబ్బంది కావాలని ఆ ప్రాజెక్టు ఎండీ ఆమ్రపాలి సీఎంకు ప్రతిపాదనలు చేశారు. సుమారు 1000 మంది వరకు అవసరం ఉంటుందని సమాచారం.


ఇక పట్టణ ప్రణాళికా విభాగం, ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ సిబ్బంది కొరత అధికంగానే ఉంది. పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ కార్యాలయం కూడా సుమారు వంద మందికిపైగా అదనపు సిబ్బంది కావాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తమకు 64 మంది సిబ్బంది కావాలని రెరా అథారిటీ ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పురపాలక శాఖ సీఎం వద్దనే ఉండటంతో విభాగాల వారీగా అధికారులు తమకు కావాల్సిన సిబ్బంది కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం కొత్త సిబ్బంది నియామకంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పురపాలక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఆంధ్రజ్యోతికి వివరించారు.

Updated Date - May 28 , 2024 | 04:52 AM