Share News

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:27 AM

రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు.

CM Revanth Reddy : ఎన్నికలు లేకున్నా.. రుణమాఫీ!

  • ఒకేసారి 31 వేల కోట్లు.. దేశంలోనే రికార్డు

  • రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే.. వారి ప్రయోజనాలకే ప్రాధాన్యం

  • 12 రోజుల్లో రూ.12500 కోట్ల మాఫీ.. ఆగస్టులో పూర్తి రుణవిముక్తుల్ని చేస్తాం

  • సోనియా, రాహుల్‌ మాటను నిలబెడుతున్నాం.. ఇది మా నిబద్ధత: రేవంత్‌

  • రెండో విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రైతు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనం లేకుండా.. కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలిపారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏ ఎన్నికలూ లేకపోయినా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రైతుకు ప్రభుత్వం అండగా ఉందన్న విశ్వాసం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. మంగళవారం శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులు, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కాంగ్రెస్‌

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు నెలలో పరాయి దేశ పీడన నుంచి దేశ ప్రజలు ఎలా స్వాతంత్య్రం పొందారో.. ఈ ఆగస్టులో బ్యాంకు రుణాల నుంచి రాష్ట్ర రైతులను విముక్తులను చేసి స్వేచ్ఛా జీవులను చేయాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గవిగా మిగిలిపోతాయన్నారు.


గత ప్రభుత్వం తప్పించుకుంది..

గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రుణమాఫీ కింద రూ.25 వేల కోట్లు చెల్లించలేకపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మొదటి దఫా రుణమాఫీని నాలుగు విడతల్లో అమలు చేస్తే.. అది వడ్డీలకే సరిపోయి, అసలు మిగిలిపోయిందన్నారు.

రెండో దఫా 2018లోనూ రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ.19 వేల కోట్లు అంచనా వేసి.. నాలుగు విడతల్లో కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు.

రైతులపై రూ.7 వేల కోట్ల బకాయి వేసి బాధ్యతల నుంచి తప్పించుకుందని ఆరోపించారు. కానీ, ఈ నెల 18న రూ.లక్ష వరకు రైతు రుణాలను మాఫీ చేసిన తమ ప్రభుత్వం.. నెల ముగియక ముందే రూ.1.50 లక్షల వరకు మాఫీ చేసిందని తెలిపారు.

ఆగస్టులో రూ.2 లక్షల వరకూ రుణాన్ని మాఫీ చేసి.. రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారదేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ రూ.31 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయలేదని, రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ రికార్డును సాధించిందని అన్నారు. ‘‘కార్పొరేట్‌ కంపెనీల అప్పులు మొండి బకాయిలుగా మారితే.. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద.. రూ.10 లక్షల అప్పును రూ.3 లక్షలకు కుదించుకుని బ్యాంకులు వసూలు చేసుకుంటుంటాయి.

అయితే మేం రైతుల ఆత్మగౌరవం దెబ్బతినకూడదన్న ఆలోచనతో బ్యాంకులకు ఫుల్‌ టైం సెటిల్‌మెంట్‌ చేసినం. ఒక్క పైసా కూడా తగ్గకుండా ఖాతాలో వేసినం’’ అంటూ బ్యాంకర్లకు సీఎం చురకలు వేశారు.


సోనియా, రాహుల్‌ ఇచ్చిన మాట మేరకు..

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ.. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారమే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఇళ్లలో జరుగుతున్న ఈ పండుగలో భాగస్వాములం కావడంతో తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నామన్నారు.

రాజకీయ ప్రయోజనం కంటే.. రైతు ప్రయోజనమే ముఖ్యమన్న విజ్ఞతను పాటించి.. మలి విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. కాగా, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రం.. రూ.31 వేల కోట్ల మేరకు రుణాన్ని ఏ విధంగా మాఫీ చేస్తుందంటూ చాలా మంది మాట్లాడారని, కొందరైతే శాపనార్థాలూ పెట్టారని తెలిపారు.

అయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేయాల్సిందేనని కూర్చుని ప్రణాళికలు రచించి.. అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేశామని పేర్కొన్నారు. తొలి దఫాలో రూ.6,098 కోట్లు, మలి దఫాలో రూ.6198 కోట్ల మేరకు మాఫీ చేశామని, రెండు దఫాల్లో సుమారు 18 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ఇది తమ పాలనా దక్షతకు, నిబద్ధతకు నిదర్శనమని, తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని అన్నారు.


భేష్‌.. భట్టీ!

గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.7 లక్షల కోట్ల భారం మోపి వెళితే.. ఆ అప్పులకు ఈ ఆరు నెలల్లో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క రూ.43 వేల కోట్ల మేరకు వడ్డీ కట్టారని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ ఆరు నెలలుగా ఐదు గ్యారెంటీలను అమలు చేస్తూ, ప్రతి నెలా మొదటి తారీకున ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్‌ ఇస్తూ.. ఏ కార్యక్రమమూ ఆగకుండా చూస్తూ కూడా రైతుల రుణమాఫీ కోసం 12 రోజుల్లో పన్నెండున్నర వేల కోట్ల రూపాయలు చెల్లించి తమ ప్రభుత్వ నిబద్ధతను నిరూపించారని కితాబునిచ్చారు.

ఇందుకుగాను భట్టివిక్రమార్కను, ఆర్థిక శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే ఈ కార్యక్రమం.. జీవిత కాలం గుర్తుండి పోయే తీపి జ్ఞాపకమన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మీదిగడ్డ తండాకు చెందిన మూడావత్‌ కొలిమి అనే మహిళా రైతు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ఆమెతో మాట్లాడుతూ రుణమాఫీ ఎంత అయిందని ప్రశ్నించగా.. రూ.లక్షా ఇరవై వేలు మాఫీ అయిందని చెప్పారు.


బ్యాంకర్లు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచాలి..

బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఒకేసారి రూ.31 వేల కోట్ల రైతు రుణాల మాఫీ గతంలో ఎప్పుడూ జరగలేదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్లు పంట రుణాలకు సంబంధించి స్కేల్‌ ఆప్‌ ఫైనాన్స్‌ పెంచాలని సూచించారు. ప్రభుత్వం కేవలం రుణమాఫీకే పరిమితం కాలేదని, రైతు బీమా కింద 42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1580 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

పంటల బీమా పథకానికి కూడా రూ.1350 కోట్ల ప్రీమియంను ప్రభుత్వం చెల్లింస్తుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రైతు భరోసా విధివిధానాలను కొద్ది రోజుల్లోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. వీటిపై శాసనసభలో చర్చించి ఆమోదం తీసుకుంటామన్నారు.

రుణమాఫీ తొలి విడతలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా 17 వేల ఖాతాలకు సంబంధించి రుణమాఫీ చెల్లింపులు జరగలేదని, నెల రోజుల్లో ఆ పొరపాట్లను సరిచేసి చెల్లించే బాధ్యత తనదేనని చెప్పారు. బ్యాంక్‌ అకౌంట్లు, ఆధార్‌లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఈ ఖాతాల్లో జమ కాలేదన్నారు. ఇందులో 8 వేల ఖాతాల్లో పొరపాట్లను సరిచేశామని, వాటికి రుణమాఫీ చెల్లింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్రంలో మంచి అవకాశం ఉందని, రైతులు ముందుకు రావాలని కోరారు.

Updated Date - Jul 31 , 2024 | 05:31 AM