Share News

Hyderabad: అసెంబ్లీలో గ్రేటర్‌..

ABN , Publish Date - Jul 13 , 2024 | 02:53 AM

రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Hyderabad: అసెంబ్లీలో గ్రేటర్‌..

  • పెరగనున్న అసెంబ్లీ సీట్లు.. అధికం గ్రేటర్‌ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏలోనే

  • నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్‌ పావులు

  • నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్‌ పావులు

  • ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి

  • మూసీ సుందరీకరణ, ఓఆర్‌ఆర్‌ దాకా జీహెచ్‌ఎంసీ విస్తరణ

  • శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం, మెట్రో లైన్‌ పొడిగింపు

  • టి-స్క్వేర్‌ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి

  • రాజకీయంగానూ కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నాలు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం

  • రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు

  • మొత్తం సీట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మూడోవంతు!

  • అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతమిది

  • ఈ ఏడాది చివర్లో మొదలుకానున్న జనగణన ప్రక్రియ!

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. డీలిమిటేషన్‌ అంటూ జరిగితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా సీట్లు పెరిగే అవకాశం ఉండడం, గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ ఆశించిన రీతిలో పట్టు చూపలేకపోయిన నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో రకరకాల అభివృద్ధి ప్రాజెక్టులకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తదుపరి శాసనసభ ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయి. పునర్విభజనతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగడంతో పాటు ఇప్పుడున్న వాటి పరిధులు కూడా మారుతాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 153కు పెరగాలి. అయితే, తాజా జనాభా లెక్కల ప్రకారం అంతకుమించి పెరిగే అవకాశం ఉందని అంచనా.


వాటిలోనూ అత్యధికం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే పెరుగుతాయి. జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగడం.. రాష్ట్ర జనాభాలో మూడో వంతుకు పైగా ఈ ప్రాంతంలోనే ఉండడం ఇందుకు కారణం. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి పదేళ్లకొకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్‌సభ, విధానసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి. ఈ క్రమంలోనే.. మొదటి లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి మన పార్లమెంటులో 489గా ఉన్న సభ్యుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1971లో జరిపిన జనాభా లెక్కల ఆధారంగా 1973లో పార్లమెంటు సభ్యుల సంఖ్యను 545కు పెంచారు. అయితే.. జనసంఖ్య ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజిస్తే.. కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థంగా పాటించి జనాభాను తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యలో 2001 దాకా ఏ మార్పూ లేకుండా ఉండేలా స్తంభింపజేశారు. దీంతో అప్పటిదాకా లోక్‌సభ సీట్ల సంఖ్య అలాగే ఉండిపోయింది.


2002లో నియోజకవర్గాల పునర్విభజన జరపాలని నాటి ఎన్డీయే సర్కారు భావించింది. కానీ.. 2001లో జనాభా లెక్కల తర్వాత కూడా అదే పరిస్థితి కనిపించడంతో.. దక్షిణ భారతదేశ రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకుగాను లోక్‌సభ సీట్ల సంఖ్య 2026 దాకా మారకుండా ఉండేలా మరోసారి రాజ్యాంగ సవరణ చేశారు. అంటే 50 ఏళ్లుగా అదే పరిస్థితి. 2021లో జరగాల్సిన జనగణన కొవిడ్‌ కారణంగా జరగకపోవడంతో.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన జరుపుతామని గత సెప్టెంబరులో కేంద్ర మంత్రి అమిత్‌ షా పార్లమెంటులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. 2026లోపే జనాభా లెక్కల సేకరణ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా జరపకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


అధికారానికి సోపానం..

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య (24).. నియోజకవర్గాల పునర్విభజనతో 50కి చేరే అవకాశాలున్నాయి. అంటే పునర్విభజన తరువాత రాష్ట్రంలో మొత్తం పెరిగే స్థానాల్లో (153).. మూడోవంతు స్థానాలు ఈ పరిధిలోనే ఉంటాయన్నమాట. ఇక్కడ అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీకే రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే.. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి జీహెచ్‌ఎంసీ, సహా ఉమ్మడి రంగారెడ్ది జిల్లాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు సంబంధించి బలమైన ముద్రను వేయాలని సీఎం రేవంత్‌ నిర్ణయించుకున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆయన ఈ ప్రాంతంలో ఒకపక్క రాజకీయ వ్యూహాలు అమలు చేస్తూనే, మరోపక్క అభివృద్ధి పథకాలకూ పెద్దపీట వేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతూనే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో పట్టు పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు చెబుతున్నారు. రాజకీయంగా ఈ ప్రాంతంలో బలంగా ఉన్న ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌ వైపు ఆకర్షించేందుకు రేవంత్‌ చేస్తున్న ప్రయత్నం అందులో భాగమేనన్నది రాజకీయ నిపుణుల మాట. అదీ చిన్నాచితకా లీడర్లు కాకుండా.. ప్రజల్లో పట్టున్నవారిపై, ఎమ్మెల్యేలుగా పలుమార్లు గెలిచిన వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం.


ఉదాహరణకు.. తాజాగా కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ 2009 నుంచి 2023 వరకూ వరుసగా గెలిచారు. శనివారంనాడు (జూలై 13న) కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రె్‌సకు తక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో.. బలమైన నాయకులను తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారు. పెరగనున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా అవరమైన బలమైన నాయకత్వాన్ని పార్టీలో ఉండేలా చేయాలనుకుంటున్నారు. అదేసమయంలో.. హైదరాబాద్‌ అభివృద్ధిలో బలమైన ముద్రవేసిన నాయకుల జాబితాలో తానూ చేరాలనే కృతనిశ్చయానికి వచ్చారు. మూసీ ప్రక్షాళన లాంటి భారీ ప్రాజెక్టును రేవంత్‌ చేపట్టిన కారణం అదేనని గుర్తుచేస్తున్నారు. మరోవైపు నగరంలో మెట్రో లైన్‌ పొడిగింపు ప్రాజెక్టుకు సంబంధించిన పనులను శరవేగంగా పట్టాలెక్కిస్తున్నారు. ఈ మెట్రో లైన్‌ను పాతబస్తీ సహా, శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయానికి అనుసంధానం చేయడంతో పాటు, ఎల్‌బీ నగర్‌ నుంచి నాగోలు వరకు కూడా లింక్‌ చేస్తున్నారు. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు కూడా మెట్రోరూట్‌ను పొడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించి మెట్రో సంస్థ పలు సర్వేలను చేస్తోంది.


అలాగే.. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకూ పెంచడం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయడం, ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య రేడియల్‌ రోడ్ల నిర్మాణం, మెట్రో లైన్‌ను వివిధ మార్గాల్లో పొడిగించడం, న్యూయార్క్‌లోని ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య కూడలి అయిన టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలోనే.. రాజధానిలోని రాయదుర్గం ప్రాంతంలో ‘టి-స్క్వేర్‌’ పేరుతో ఐకానిక్‌ ప్లాజాను నిర్మించడం, గట్టిగా వాన కురిస్తే నదిలా మారి ట్రాఫిక్‌తో స్తంభించిపోయే హైదరాబాద్‌ మహానగరానికి ఆ దుస్థితి తప్పించేలా విపత్తు నిర్వహణకు, కబ్జాదారుల నుంచి ప్రభుత్వభూములు, చెరువులు, పార్కులను రక్షించడానికి.. హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌)ను ఏర్పాటు చేయడం, నగరం చుట్టూ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, హైదరాబాద్‌కు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం వస్తున్న నేపథ్యంలో.. టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటీఐలను ఆధునిక నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓఆర్‌ఆర్‌ అవతలివైపు కూడా అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఓ ప్రణాళిక రూపొందించారు. ఇలా వచ్చే నాలుగున్నరేళ్లలో అటు రాజకీయ, ఇటు అభివృద్ధి ప్రణాళికలతో.. ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం భావిస్తున్నారు.


ఈ ఏడాది మొదలుపెట్టి..

ఈ ఏడాది చివర్లో.. పునర్విభజనకు ప్రామాణికమైన జనగణనను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. రానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జనగణన మొదలైతే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో 6-7 నెలల్లోనే జనాభా వివరాలు వెల్లడవుతాయి. 2026 ఆగస్ట్‌-సెప్టెంబర్‌ నాటికి లెక్కలు పూర్తిగా తేలుతాయని అంచనా. అనంతరం.. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ఆ ప్రక్రియపై ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆందులో భాగంగానే నియోజకవర్గాల రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశాలున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల రిజర్వేషన్లలోనూ మార్పుచేర్పులు చోటుచేసుకోనున్నాయి.

Updated Date - Jul 13 , 2024 | 02:53 AM