Hyderabad : రూ.1000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్
ABN , Publish Date - Aug 07 , 2024 | 06:15 AM
తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.
హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సంస్థ
సీఈవోతో సీఎం రేవంత్ బృందం చర్చలు.. ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ విస్తరణ
మూడేళ్లలో వెయ్యి మందికి ఉద్యోగం.. ఆర్సీసీఎం విస్తరణతో 500 నియామకాలు
అమెరికా పర్యటనలో రేవంత్ ఒప్పందాలు.. చైనాతో పోటీ పడదాం
హైదరాబాద్, అమెరికాకు అనేక సారూప్యతలు.. పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ
టైమ్‌స్క్వేర్‌లో రేవంత్ పర్యటన దృశ్యాల ప్రదర్శన
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు. పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
కాగా, బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ ‘స్వచ్ఛ బయో’ తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలో రాష్ట్రంలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. మొదటి దశలో రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను నిర్మించి, 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో.. స్వచ్ఛ్ బయో చైర్‌పర్సన్ ప్రవీణ్ పరిపాటి మంగళవారం చర్చలు జరిపారు. స్వచ్ఛ్ బయోలో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ.. బయోమాస్, సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలు ఉత్పత్తి చేసే పేటెంట్ పొందడంతోపాటు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిర, పర్యావరణ అనుకూల వృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రవీణ్ పరిపాటి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి, దృక్పథం తమను ఆకట్టుకుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు.
నగరంలో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్..
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ట్రైజిన్.. హైదరాబాద్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ను నెలకొల్పనుంది. డేటా అనలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్‌పలకు అవసరమయ్యే సొల్యూషన్లను అందించే ఈ కంపెనీ.. ఆరు నెలల్లో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది.
సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. ఇందులో వంద మంది పని చేస్తున్నారు. తాజా చర్చల అనంతరం కార్యకలాపాలను మరింత విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రానున్న మూడేళ్ల కాలంలో వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకొని శిక్షణ ఇవ్వనుంది.
కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా రెండున్నర వేల మంది పని చేస్తున్నారు. ఇందులో వెయ్యి మంది భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. 160 మిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉన్న ట్రైజిన్ విస్తరణతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హైదరాబాద్ మరింత పురోగతి సాధిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితితోపాటు దాని అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ రెండు దశాబ్దాలకు పైగా సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఆర్సీసీఎం విస్తరణతో కొత్త ఉద్యోగాలు..
టెక్నాలజీ, సర్వీసెస్ సొల్యూషన్స్‌లో పేరు పొందిన అమెరికన్ కంపెనీ ఆర్సీసీఎం తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించనుంది. రానున్న రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను నియమించి కార్యకలాపాలు కొనసాగించనుంది. అమెరికా తర్వాత విదేశీ గడ్డపై తొలిసారిగా కంపెనీ విభాగాన్ని తెలంగాణలోనే స్థాపించనుండడం గమనార్హం. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శ్రీధర్ బాబు.. ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరితో చర్చలు జరిపి అధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాఽధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ క్రమంలో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని చెప్పారు. ఆర్సీసీఎం రాకతో హైదరాబాద్.. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ అంటేనే బిజినెస్..
తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరిశ్రమల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా తమ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుందని తెలిపారు. అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేది తమ సంకల్పమని పేర్కొన్నారు.
తెలంగాణ అంటేనే వ్యాపారం.. తెలంగాణ అంటేనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని ప్రకటించారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వర్కింగ్ లంచ్ అనంతరం వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఈవీ, బయోటెక్, షిప్పింగ్ రంగాల్లో పేరొందిన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చైర్‌పర్సన్‌లు, సీఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల గురించి వివరించారు. త్వరలోనే హైదరాబాద్‌లో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఇది భారత దేశపు భవిష్యత్తుకు చిరునామాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
దేశంలోనే జీరో కార్బన్ సిటీ ఇక్కడ ఏర్పడతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌తోపాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా విలేజ్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
ఈ ఫ్యూచర్ సిటీ.. రాష్ట్ర అభివృద్ధితోపాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి హోదాలో ఇది తన మొదటి అమెరికా పర్యటన అని.. ఇక్కడి నుంచి వీలైనన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకెళ్లాలలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. నిజాంలు నిర్మించిన 425 ఏళ్ల పురాతనమైన హైదరాబాద్ ఇంచుమించుగా అమెరికాతో సమకాలీనంగా ఉండటం ఆసక్తి రేపుతోందన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు రావాలని, హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
అంధుల క్రికెట్ జట్టును అభినందించిన సీఎం
జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సంకల్పాన్ని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న న్యూయార్క్‌లోని భారత అంధుల బాలుర క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. న్యూయార్క్‌లో క్రికెట్ జట్టు సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ జట్టును కలుకునే అవకాశం రావడం ఎంతో అమూల్యంగా భావిస్తున్నానని, వీరు ఎందరికో స్ఫూర్తిదాయకులని అన్నారు.
టైమ్‌స్క్వేర్ తెరపై రేవంత్
న్యూయర్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌స్క్వేర్ వద్ద ఉన్న భారీ స్ర్కీన్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన దృశ్యాలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ ఏర్పాట్లు చేశారు.