Share News

CM Revanth Reddy: రైతులూ.. ఉచ్చులో పడొద్దు

ABN , Publish Date - Dec 01 , 2024 | 03:09 AM

రైతులు బీఆర్‌ఎస్‌ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

CM Revanth Reddy: రైతులూ.. ఉచ్చులో పడొద్దు

  • బీఆర్‌ఎస్‌ నాయకుల మాయమాటలను నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు

  • గిరిజనులను అడ్డం పెట్టుకొని లగచర్లలో మంటలు రేపారు

  • గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా?

  • ఎవరు అడ్డొచ్చినా కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకొస్తా

  • 25 వేల ఉద్యోగాలిచ్చి.. అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

  • దేశంలో పది నెలల్లోపే 21 వేల కోట్ల రుణమాఫీ ఘనత మాదే

  • సంక్షేమ పథకాల కోసం అప్పులు తేలేదు.. భూములు అమ్మలేదు

  • అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు.. ఇప్పుడు బోనస్‌ ఇస్తున్నాం

  • పాలమూరుకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తాం

  • కేసీఆర్‌ ఎవరినీ కలవలే.. రేవంతన్నా అంటే పలుకుతున్నా

  • రైతు సదస్సు ముగింపు సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నాలుగో విడత రూ.2747 కోట్ల రుణమాఫీ

మహబూబ్‌నగర్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులు బీఆర్‌ఎస్‌ పన్నిన ఉచ్చులో పడొద్దని, ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసుల పాలు కావొద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమల ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చరిత్రలో ఎక్కడా భూసేకరణ చేయనట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి హయాంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌కు భూసేకరణ చేయలేదా? అని నిలదీశారు. ఆ సమయంలో తాము కూడా ఇలాగే దాడులు చేసేలా ప్రజలను రెచ్చగొడితే ప్రాజెక్టులు కట్టేవారా? అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో తమకే దక్కిందన్నారు. శనివారం.. మహబూబ్‌నగర్‌ సమీపంలోని అమిస్తాపూర్‌ వద్ద మూడు రోజులుగా జరుగుతున్న రైతు పండుగ ముగింపు ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న రూ.2 లక్షల రుణమాఫీ కింద రూ.2747 కోట్లను విడుదల చేశారు. భూత్పూరు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రైతులకు లాంఛనంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాల భూమి ఉందని, కేవలం 1300 ఎకరాలు సేకరించి.. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామనుకుంటే. అమాయక గిరిజనులను అడ్డుపెట్టుకొని లగచర్లలో మంటలు రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌పై, అధికారులపై దాడి చేసే వరకు వివాదం చేశారని ధ్వజమెత్తారు. రైతులు భూములు ఇస్తే తానేమైనా చాపలా చుట్ట చుట్టుకొని కొండారెడ్డిపల్లికో, హైదరాబాద్‌కో తీసుకుపోతానా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూమి ఉందని, హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయని తెలిపారు. రైతుకు భూమి తల్లి లాంటిదని, భూసేకరణలో కొంత నష్టం జరిగినా.. రూ.10 లక్షలు కాకపోతే రూ.20 లక్షల చొప్పున ఇస్తానన్నారు. సంతకం పెట్టి ఇంటికి తెచ్చి ఇస్తారని, సహకరించాలని కోరారు. ఇంటికో ఉద్యోగం వస్తే ఒక తరం రాతే మారిపోతుందని తెలిపారు.


  • ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

ఎవరు అడ్డొచ్చినా, ఆటంకాలు సృష్టించినా.. తనను ఆశీర్వదించిన కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకెళ్లి తీరతానని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. అక్కడి యువతకు 25 వేల ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి చేసుకుంటానని, తనను ఆదరించి, ఆశీర్వదించిన ప్రాంతం రుణం తీర్చుకుంటానని ప్రకటించారు. నల్లమలలో పులులను, మృగాలను చూసిన తనకు మానవ మృగాలంటే భయం లేదని వ్యాఖ్యానించారు. ‘‘మొసలికన్నీరు కారుస్తున్న హరీశ్‌రావ్‌.. మల్లన్నసాగర్‌లో బీఆర్‌ఎస్‌ అరాచకాలను భరించలేక చితి పేర్చుకొని సజీవ దహనమైన రైతు మల్లారెడ్డి ఇంటికి పోదామా?’’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు. పనిచేసే క్రమంలో తాము చేసింది చెప్పుకోవడం మరిచిపోయామని, కష్టపడి పనిచేయడం తప్ప.. పాలమూరు బిడ్డలకు ఏమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఇకపై తాను ఎవరినీ ఏమీ అనదలచుకోలేదని, రైతులే తనకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారి ప్రభుత్వ అభివృద్ధిని నలుదిక్కులా చాటాలని, ఒక్కో రైతు ఒక్కో రేవంత్‌రెడ్డి కావాలని అన్నారు.


  • అప్పుల కుప్పగా మార్చారు..

సమైక్య పాలనలో సీమాంధ్ర వారు పాలమూరును అభివృద్ధి చేయలేదని ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని తెచ్చుకుంటే.. పదేళ్లలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాధ్యతగా పనిచేస్తూ రూ.60 వేల కోట్ల రుణాలు చెల్లించామని చెప్పారు. రుణమాఫీ, కనీస మద్దతు ధర, ఉచిత విద్యుత్‌, పంటలకు బోనస్‌.. వంటివన్నీ కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్లు అని చెప్పారు. నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్‌ పాలనలో కట్టిన నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు ఎంత వరద వచ్చినా నిటారుగా నిలబడి నేటికీ రైతుల సేవలో ఉన్నాయని తెలిపారు. కానీ, రూ. 1.02 లక్షల కోట్లు ఖర్చు చేసి కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కుప్పకూలిందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి నీరివ్వకున్నా 66 లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు వరి సాగు చేసి రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశారని చెప్పారు. గత ప్రభుత్వం ‘వరి వేస్తే.. ఉరి’ అని చెప్పిందని, తాము వచ్చాక వరికి రూ.500 బోనస్‌ ఇస్తున్నామని సీఎం రేవంమత్‌ గుర్తుచేశారు. మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్‌ డబ్బులు పడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతల గుండెల్లో పిడుగులు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులకు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారని రేవంత్‌ చెప్పారు.


  • ఏక మొత్తంలో రుణమాఫీ..

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో.. మొదటి దఫా రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతల్లో చేస్తే అది వడ్డీకే సరిపోయిందన్నారు. ఇక రెండోసారి రూ.లక్ష రుణమాఫీ నాలుగేళ్లు చేయకుండా చివరిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు అమ్మి రూ.11 వేల కోట్లు మాఫీ చేశారని తెలిపారు. కానీ, వడ్డీకి రూ. 8500 కోట్లు పోగా కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావొద్దనే కేబినెట్‌ మంత్రులతో చర్చించి ఏకమొత్తంలో రుణమాఫీ చేశామని వివరించారు. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోపే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో తమకే దక్కిందన్నారు. ప్రధానమంత్రి మోదీ గానీ, కేసీఆర్‌ గానీ తాను రుణమాఫీ చేయలేదని నిరూపించగలరా? అని సీఎం సవాల్‌ విసిరారు. పది నెలల కాలంలోనే రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు 1.73 కోట్ల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించేలా పథకం పెట్టామని అన్నారు. రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, డైట్‌ కోసం 40ు నిధుల పెంచామని అన్నారు. ఇందుకు అప్పులు చేయలేదని, కోకాపేటలో భూములు అమ్మలేదని చెప్పారు. రైతులకు రూ.52వేల కోట్ల పైచిలుకు బడ్జెట్‌ను కేటాయించామని, అప్పులకే రూ.60 వేల కోట్లు చెల్లించామని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం చేసిన దోపిడీ భారాన్ని ప్రభుత్వం మోయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఎవరికీ సీఎంను కలిసే భాగ్యమే లేదని, ఇప్పుడు ‘రేవంతన్నా’ అంటే పలుకుతున్నానని చెప్పారు.


  • ఐదేళ్లలో పాలమూరుకు లక్ష కోట్లు..

పాలమూరు ప్రజలు గుంపు మేస్ర్తీల ఆధ్వర్యంలో బొంబాయి, దుబాయి, ఇతర రాష్ర్టాలకు తట్ట, మట్టి, పార పనికి వలస వెళ్లారని సీఎం రేవంత్‌ అన్నారు. వందలాది బస్సుల్లో ప్రజలు వలస పోతుంటే తమకూ ఓ రోజు వస్తుందని ఎదురు చూశామన్నారు. 70 ఏళ్ల తరువాత పాలమూరుకు అవకాశం వచ్చిందని, ఇప్పుడు కచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రకటించారు. పాలమూరుకు ఏటా రూ.20 వేల కోట్ల నిధులు ఇవ్వాల్సిందిగా క్యాబినెట్‌ సహచరులను కోరానని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు తెచ్చి పసిడి పంటల పాలమూరును చేసి చూపిస్తానని చెప్పారు.


  • శభాష్‌ తుమ్మల

రైతు పండుగను విజయవంతం చేయడంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో కృషి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు రైతు పండుగను నిర్వహించగా.. స్టాళ్ల ఏర్పాటు, రైతులకు శాస్త్రవేత్తల సూచనలు అందేలా చూడటం, నూతన వంగడాలు, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడంతో కార్యక్రమం విజయవంతం అయిందంటూ తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 01 , 2024 | 09:11 AM