Caste Census: సమగ్ర కుల గణన..
ABN , Publish Date - Oct 12 , 2024 | 03:01 AM
రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాలకు సంబంధించి కులం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు సహా పూర్తి వివరాలను సేకరించనుంది.
ఇంటింటివారీగా వివరాల సేకరణ
సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య,
ఉద్యోగ, రాజకీయ అవకాశాల లెక్కలు
60 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలే లక్ష్యం
ఈడబ్ల్యూఎస్ లెక్కలకూ ఇదే ప్రాతిపదిక?
సర్వే పర్యవేక్షణ బాధ్యత ప్రణాళిక శాఖకు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరిగి అన్ని కుటుంబాలకు సంబంధించి కులం, ఆర్థిక, సామాజిక స్థితిగతులు సహా పూర్తి వివరాలను సేకరించనుంది. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాల వారికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించేందుకు సమగ్ర కుల గణన చేపట్టాలని శాసనసభ, మంత్రిమండలి ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ సర్వేను మొత్తం 60 రోజుల్లో పూర్తి చేస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖను ఈ కార్యక్రమానికి నోడల్ శాఖగా నియమించారు. ఈ మేరకు వివరాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులను(జీవో ఎంఎస్ నెం.18) జారీ చేశారు.
రాష్ట్రంలో కుల గణనను చేపట్టాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజే ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిర్వహించింది. కానీ, కులాల వారీగా సేకరించిన వివరాలను బయట పెట్టలేదు. సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పన కోసం మాత్రమే ఈ వివరాలను ఉపయోగించుకుంది. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలన్న చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది. బీసీ కులాల వివరాలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల కోసం వారి రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. బీసీ కులాల వివరాలు తేల్చాలని హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమగ్ర కులగణన చేపడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఫిబ్రవరి 4న రాష్ట్ర మంత్రిమండలి కూడా కులగణన చేపట్టడానికి ఆమోద ముద్ర వేసింది.
ఈ నేపథ్యంలోనే కుల గణన జీవో విడుదలైంది. దీన్ని కొన్ని కులాలకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అందరి వివరాలను ఇంటింటి సర్వే రూపంలో సేకరించనున్నారు. ప్రతి కుటుంబం కులం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశాలు సంబంధిత వివరాలను సేకరిస్తారు. వెనుకబడిన తరగతులు(బీసీ), షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ), ఇతర బలహీన వర్గాల వివరాలు తెలుసుకోవడం ద్వారా వారికి ఏ మేర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు పెంచాలో నిర్ణయానికి వస్తారు. నోడల్ శాఖగా నిర్ణయించిన ప్రణాళిక శాఖ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుంది. సర్వేను ఎలా చేపట్టాలి అనే విధి విధానాలను ప్రణాళిక శాఖ ప్రకటించే అవకాశం ఉంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మేరకు రిజర్వేషన్లు కల్పించాలనే విషయంలోనూ ఈ సర్వే డేటాయే ప్రాతిపదిక కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు(ఈడబ్ల్యూఎస్) కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకొనే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహనతో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విధాన నిర్ణయాలను తీసుకొనే లక్ష్యంతో ఈ సర్వే విధివిధానాలను రూపొందించనున్నారు. సర్వే సమాచారం ద్వారా రాష్ట్రంలో కులాల వారీగా జనాభా విస్తరణపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన వస్తుంది. రాజకీయ రిజర్వేషన్లను కల్పించే విషయంలోనూ క్షేత్ర స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఆయా కులాలు, వర్గాలు ఉన్నాయా? అని చూసుకొని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సర్వే పూర్తయితే రాష్ట్ర వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులోకి తెచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. నోడల్ శాఖగా ప్రణాళిక శాఖను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో సర్వేకు పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే బిహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో చేపట్టిన కుల గణనల విధి విధాలను అధ్యయనం చేశారు.