Congress: ఆటుపోట్లున్నా.. అభివృద్ధి దిశగా!
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:26 AM
ఏడాదికి ముందు.. అతలాకుతలంగా, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర రాబడులు నిర్దేశిత వ్యయాలకే సరిపోయే పరిస్థితి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కనిపించని దుస్థితి.
ఏడాది ప్రగతిబాటలో రేవంత్ సర్కారు
రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు
కాంగ్రెస్ ముద్ర.. కొత్త ప్రాజెక్టులు
మూసీ, ఫోర్త్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో
గురుకులాల్లో సమీకృత భవనాలు
55,143 ఉద్యోగాల భర్తీ
సాగునీటి ప్రాజెక్టులపై రూ.10 వేల కోట్ల ఖర్చు
దూకుడే కాస్త ఇబ్బందికరం అత్యంత కీలకం కానున్న రెండో ఏడాది పాలన
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి): ఏడాదికి ముందు.. అతలాకుతలంగా, అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రాష్ట్ర రాబడులు నిర్దేశిత వ్యయాలకే సరిపోయే పరిస్థితి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కనిపించని దుస్థితి. నిరాశాజనకంగా రెవెన్యూ, విద్య, వైద్యం, సాగునీరు తదితర రంగాలు. ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలందక తీవ్ర నిరాశా నిస్పృహలు. దళితుల దరి చేరని దళిత బంధు. అతీగతీ లేని గిరిజన బంధు, బీసీ బంధు. ఇలా.. బీఆర్‌ఎస్ హయాంలో పలు వర్గాల్లో ఆందోళన. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుటుంబ పెత్తనం పెరిగిపోయాయన్న ఆరోపణలు. ఇలాంటి సందిగ్ధావస్థ, సవాళ్ల నడుమ సరిగ్గా 2023 డిసెంబరు 7న అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ డిసెంబరు 7తో ఏడాది కాలం పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో రేవంత్‌రెడ్డి సర్కారు అనేక ఆటుపోట్లు, ఆటంకాలు, సవాళ్లను ఎదుర్కొంది. అయినా.. వాటి మధ్యే అభివృద్ధి దిశగా పయనించింది. కొన్ని లోపాలు చోటుచేసుకున్నా.. మొత్తంగా ఏడాది పాలన పర్వాలేదనిపించింది. అయితే.. ఈ ఏడాదిలో ఎదురైన సమస్యలు, అనుభవాలతో రాబోయే కాలంలో మెరుగైన పాలన అందించాలన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సమర్థులు, సీనియర్లను తన మంత్రివర్గ సహచరులుగా ఎంపిక చేసుకుని, రాష్ట్రంలో పాలనను మొదలు పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, పార్టీ ఇచ్చిన హామీలను కొన్నింటిని అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ, సంక్షేమ పాలనను అందిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది.
సొంత ముద్ర.. సరికొత్త ప్రాజెక్టులు
గత ముఖ్యమంత్రుల మాదిరిగానే తన మార్కు అభివృద్ధి కూడా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. గతంలో చంద్రబాబునాయుడు హైటెక్ సిటీని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రింగు రోడ్డును నిర్మించినట్లుగానే.. అభివృద్ధిలో సొంత ముద్ర ఉండాలని రేవంత్ యోచించారు. అందులో భాగంగానే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మూడు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు చేపట్టారు. మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవం లక్ష్యంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు.. మొత్తం హైదరాబాద్ నగరానికి కొత్త కళను తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుతో పర్యావరణ పరంగానే కాకుండా.. ఆర్థిక, ఉపాధి, ఉద్యోగాల పరంగా కొత్త అవకాశాలు తీసుకొచ్చేలా చేయాలన్న సంకల్పంతో ఉంది. త్వరలో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించనుంది. ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్ఠ్టాత్మక ప్రాజెక్టు.. ఫోర్త్ సిటీ. 40 వేల ఎకరాల పరిధిలో అద్భుతమైన సరికొత్త నగరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని, జీనోమ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. స్కిల్ యూనివర్సిటీని రూ.200 కోట్లతో నిర్మించడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్(మెయిల్) సంస్థ ముందుకు రావడమే కాకుండా... ఈ నిర్మాణ పనులకు శంకుస్థాపన కూడా చేసింది. ఇవి కాకుండా రీజినర్ రింగ్ రోడ్డును కూడా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. వీటితోపాటు హైదరాబాద్‌లో మెట్రోను మరో దశ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సుమారు 72 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించనున్నారు.
సమీకృత గురుకులాలు..
ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వేర్వేరుగా ఉన్న గురుకుల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. వీటన్నింటినీ ఒకే ప్రాంగణంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పేరిట ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున నిర్మించనుంది. మరోవైపు సాగునీటి రంగంలో ఏడాది కాలంలోనే రూ.10 వేల కోట్ల వరకు వ్యయం చేసింది. ఇక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని ప్రభుత్వం అమలు చేసి చూపింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, బియ్యం సబ్సిడీ, ఉపకార వేతనాలు, డైట్ చార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలన్నింటికీ రూ.61,194 కోట్లను వ్యయం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి నవంబరు నాటికే దాదాపు రూ.9,888 కోట్లను ఖర్చు చేయడం గమనార్హం. రుణమాఫీ పథకాన్ని కూడా తొలి ఏడాదే భుజానికెత్తుకుంది. నిధుల సర్దుబాటు సమస్య అత్యంత తీవ్రంగా ఉన్నా.. ఒక్క రుణమాఫీ పథకం కిందే రూ.20,616 కోట్లను వెచ్చించింది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసాను అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఏడాదిలో 55,143 ఉద్యోగాల భర్తీ
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌తో కొనసాగిన తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి మననం చేసుకుంటూ ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏడాది కాలంలో ఏకంగా 55,143 ఉద్యోగాలను భర్తీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 12,324 పోస్టులు, మెడికల్ అండ్ హెల్త్ రికూ్ట్రట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ) ద్వారా 7,378 పోస్టులు, తెలంగాణ స్టేట్ పోలీస్ రికూ్ట్రట్‌మెంట్ బోర్డు(టీజీపీఆర్‌బీ) ద్వారా 16,067 పోస్టులు, తెలంగాణ రెసిడెన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రికూ్ట్రట్‌మెంట్ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా 8,304 పోస్టులు, పాఠశాల విద్యా శాఖ ద్వారా 10,006 పోస్టులు, ఇతర సంస్థల ద్వారా 441 పోస్టులను భర్తీ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వెలువడిన కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లతో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేసింది. 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు, 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలను చేపట్టి, భేష్ అనిపించుకుంది.
దూకుడుతో సమస్య!
ప్రభుత్వ పాలన ఏడాదికాలం సాఫీగా సాగినా.. దూకుడు వ్యవహారమే కాస్త ఇబ్బందులు సృష్టిస్తోందనే అభిప్రాయం ఉంది. పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా కొన్ని ఆటంకాలు ఎదురవడం సహజం. కానీ, వాటిని ముందస్తు ప్రణాళిక ప్రకారం అమలు చేయాలి. చేసే పని మంచిదే అయినా.. దానికి ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా కూడగట్టడం అత్యంత ప్రధానం. ఉదాహరణకు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలోనే ప్రభుత్వం తొలుత కాస్త బోల్తా పడింది. నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని, ఏళ్ల తరబడి ఉంటున్న నిర్వాసితులను ముందుగా ఒప్పించకుండా, వారికి భరోసా కల్పించకుండా ముందుకెళ్లింది. దీంతో నిర్వాసితులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ తర్వాత విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం నేరుగా ప్రజల్లోకి వెళ్లింది. నల్లగొండ జిల్లాలో రైతులతో భారీఎత్తున పాదయాత్ర నిర్వహించింది. పర్యావరణవేత్తలు కూడా మూసీకి మద్దతు పలికారు. మరోవైపు హైడ్రా విషయంలోనూ ఇలాంటి అపవాదునే ఎదుర్కొంది. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని కూడా సరిదిద్దుకుంది. ఇక లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం ఇటీవల భూసేకరణ చేపడితే కలెక్టర్, ఇతర అధికారులపై స్థానికులు దాడికి దిగడం సంచలనం రేపింది. దాంతో సీఎం రేవంత్‌రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అక్కడ ఫార్మా విలేజ్ కాదని, ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు స్థానికులు కాస్త చల్లబడ్డారు. ఇలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టే బదులు.. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏ వర్గానికీ ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పథకాలు చేపట్టాలన్న అభిప్రాయాలున్నాయి.
మాంద్యంతోపాటు హైడ్రా దెబ్బ
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించింది. అయితే ఇది హైదరాబాద్ ఒక్క నగరంలోనే జరిగింది కాదు. ఆర్థికమాంద్యం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది కొంతవరకు వాస్తవమే కూడా. కానీ, దీనికి హైడ్రా కూడా తోడైందన్న భావన నెలకొంది. భవన నిర్మాణ అనుమతులు ఆలస్యం అయ్యాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే వీటిపైనా ప్రభుత్వం కొన్ని సానుకూల చర్యలు చేపట్టింది. బిల్డ్ నౌ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అనుమతులను వేగవంతం చేస్తామని తెలిపింది. ఏదేమైనా రాష్ట్ర ఆదాయానికి హైదరాబాద్ సంపదే ప్రధాన వనరు. ఇక్కడి నుంచే అధిక రాబడి సమకూరుతుంది. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగం లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ రంగం మళ్లీ పుంజుకునేలా చేస్తేనే రాష్ట్ర ఆదాయమూ పెరుగుతుందనేది నిపుణుల అంచనా.
రెండో ఏడాది అత్యంత కీలకం
మొదటి ఏడాదిలో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు, ఇతరత్రా కొన్ని అసంతృప్తులున్నా.. సంక్షేమం వైపు సాగిన ప్రభుత్వానికి రెండో ఏడాది అత్యంత కీలకంగా మారనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కీలక ప్రాజెక్టులను పట్టాలెక్కించాల్సి ఉంది. మూసీ నది ప్రక్షాళన, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు, ఫోర్త్‌సిటీ నిర్మాణం, మెట్రో విస్తరణ తదితరాలన్నీ ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచడంతోపాటు రాష్ట్ర ప్రగతిని కూడా నిర్దేశించేవే. హైదరాబాద్‌కు పర్యావరణపరంగా, ఆర్థికపరంగా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ఉపకరిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుతో మొత్తం తెలంగాణలోనే దాదాపు సగం మంది జనాభా దీని పరిఽధిలోకి వచ్చేస్తారు. అంటే రాష్ట్రంలో సుమారు సగం ప్రాంతం ఈ రీజనల్ రింగ్‌రోడ్డుతో ప్రభావితమవుతుంది. ఫోర్త్‌సిటీ నిర్మాణం హైదరాబాద్ సిగలో మరో మణిహారం అయ్యే అవకాశాలుంటాయి. 72కిలోమీటర్ల మేర అదనంగా మెట్రో నిర్మాణం, హైదరాబాద్ అభివృద్ది నగరాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తొలి ఏడాది ఈ నాలుగు ప్రాజెక్టులు ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ భవిష్యత్తునే మార్చగల సత్తా ఉన్నవని అంచనా. రెండో ఏడాది వీటిని పట్టాలెక్కించాల్సి ఉంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో అంతా సవ్యంగా సాగి ఎన్నికల నాటికి చేసినవాటిని చూపించుకోగలిగితే సాధికారికంగా ఓట్లు అడిగే పరిస్థితి వస్తుంది.