Share News

Medical Education: ఆరోగ్యశ్రీ నిధుల్లో కోత..

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:20 AM

కాంగ్రెస్‌ సర్కారు ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆస్పత్రులు, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా.. ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది.

Medical Education: ఆరోగ్యశ్రీ నిధుల్లో కోత..

  • రూ.1,065 కోట్లు కేటాయింపు..

  • గత ఏడాది కంటే తక్కువే

  • నర్సింగ్‌, మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం రూ.742 కోట్లు

  • ప్రజల డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులకు రూ.200 కోట్లు

  • వైద్య రంగానికి రూ.11,468 కోట్లు.. బడ్జెట్‌లో 3.93 శాతం

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సర్కారు ఒకవైపు వైద్య విద్యకు పెద్దపీట వేస్తూనే.. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి నిధుల్లో కోత పెట్టింది. ఆస్పత్రులు, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించగా.. ఆరోగ్యశ్రీకి గత ఏడాది కంటే తక్కువ కేటాయించింది. వైద్య రంగానికి రూ.11,468 కోట్లు కేటాయించగా.. ఇది మొత్తం బడ్జెట్‌లో 3.93 శాతం. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.5,725 కోట్లు చూపించింది. జీతభత్యాలు మినహా అభివృద్ధి పనులకు కేటాయించే మొత్తాన్ని ప్రగతి పద్దు కింద పరిగణిస్తారు. గత ఏడాది బీఆర్‌ఎస్‌ సర్కారు వైద్య శాఖకు రూ.12,161 కోట్లు కేటాయించింది. అందులో ప్రగతి పద్దు కింద రూ.6,566 కోట్లు చూపించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు రూ.693 కోట్లు తగ్గాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతుల్రు, మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలకు ప్రాధాన్యమిస్తూ రూ.1,002 కోట్ల కేటాయింపులు చేసింది. ఇందులో జిల్లాకొక నర్సింగ్‌ కాలేజీ కోసం రూ.200 కోట్ల కేటాయించింది.


కేసీఆర్‌ న్యూట్రియంట్‌ కిట్స్‌కు కేటాయింపులు చేయలేదు. 2022-23 బడ్జెట్‌లో వైద్య రంగానికి 4.37 శాతం నిధులు కేటాయిస్తే, అది గత ఏడాది 4.18కి, ఈసారి 3.93 శాతానికి తగ్గింది. ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి రూ.1,065 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.1,101 కోట్లు కేటాయింపులు చూపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ఈ పథకంలో వైద్య చికిత్సలతో పాటు వాటి ప్యాకేజీ ధరలను కూడా 20-25 శాతం పెంచారు. ఈ లెక్కన ఆరోగ్యశ్రీకి కేటాయింపులు పెంచాల్సి వుండగా తగ్గించారు. ఆయుష్మాన్‌ భారత్‌ మ్యాచింగ్‌ గ్రాంటు రూ.168 కోట్లుగా చూపారు. గత బడ్జెట్‌లో రూ.115 కోట్లుగా చూపించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కలిగిన డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు విధానం త్వరలోనే ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది.

Updated Date - Jul 26 , 2024 | 04:20 AM