TG: నకిలీపై నజర్...
ABN , Publish Date - May 31 , 2024 | 03:38 AM
వానాకాలంపై ఎన్నో ఆశలతో చేలల్లో విత్తనాలు విత్తేందుకు.. ఎరువులు చల్లేందుకు సిద్ధమవుతున్న రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను అంటగట్టేందుకు కాచుక్కూర్చున్న ముఠాల ఆటకట్టించేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది.
సాగు, రెవెన్యూ, పోలీస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్
విత్తన, ఎరువుల తయారీ, విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
నకిలీలపై రైతులకు అవగాహనా కార్యక్రమాలు
సరిహద్దుల్లో చెక్‌పోస్టులు.. రైళ్లల్లోనూ సోదాలు
నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్ట్
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): వానాకాలంపై ఎన్నో ఆశలతో చేలల్లో విత్తనాలు విత్తేందుకు.. ఎరువులు చల్లేందుకు సిద్ధమవుతున్న రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులను అంటగట్టేందుకు కాచుక్కూర్చున్న ముఠాల ఆటకట్టించేందుకు కాంగ్రెస్ సర్కారు సమాయత్తమైంది. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాల్ని అరికట్టేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి నకిలీ ఎరువులు, విత్తన తయారీ, విక్రయ కేంద్రాలపై వరుస దాడులు చేపట్టాయి. వచ్చే నెలలో మృగశిర కార్తె రాకతో పంటల కోసం విత్తనాలు అలికే పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీ విత్తన కట్టడిపై ఇప్పటికే పోలీస్ శాఖ దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం వ్యవసాయ, పోలీస్ శాఖ అత్యున్నతాధికారులు సమావేశమై నకిలీ విత్తనాలు అరికట్టడంలో సంయుక్తంగా చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
నకిలీ విత్తన, ఎరువుల ముఠాలను కట్టడి చేయడంలో భాగంగా అవసరమైతే తయారీ, రవాణా, విక్రయ దారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని నిర్ణయించారు. గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తన, ఎరువుల విక్రయాలకు సంబంధించి వెయ్యికిపైగా కేసులు నమోదుకాగా వాటిల్లో సుమారు 70 మందికిపైగా నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై ఐపీసీ 420, సీడ్స్(కంట్రోల్) ఆర్డర్-1982లో 3(1) సెక్షన్, ఈసీయాక్ట్ 1995లో సెక్షన్ 3(2)(డీ), ఇన్‌సెక్టిసైడ్స్ యాక్ట్ 1968లో సెక్షన్29(1)(సీ) కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఏపీలోని కర్నూలు, గుంటూరుతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి పెద్దఎత్తున రైలు, రోడ్డు మార్గాల్లో రాష్ట్రంలోకి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ నిఘా నుంచి తప్పించుకునేందుకు రైల్లోనూ నకిలీ విత్తనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండటంతో అలాంటివారిపైనా నిఘా పెంచారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో దిగుమతయ్యే నకిలీ విత్తనాలు ఉమ్మడి కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
కళా బృందాలతో నకిలీలపై అవగాహన
నకిలీ విత్తనాల బారినపడే వారిలో ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లోని రైతులే ఉంటున్నారు. దీంతో మారుమూల గ్రామీణ రైతులపై పోలీసు శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నకిలీ విత్తనాలపై గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నకిలీ విత్తనాలపై విస్తృత ప్రచారం కల్పిచేందుకు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనున్నారు. ‘‘నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.’’ అని డీజీపీ రవిగుప్తా హెచ్చరించారు.