Aadi Srinivas: కేటీఆర్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?
ABN , Publish Date - Oct 28 , 2024 | 03:53 AM
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మూడేళ్ల క్రితం డ్రగ్స్ వాడకానికి సంబంధించి ‘వైట్ చాలెంజ్’ విసిరితే వెనుకాడిన కేటీఆర్..
పార్టీలో ఎంతటి వారున్నా శిక్షించాలి
కేటీఆర్ సహా అందరికీ పరీక్ష చేయాలి
విప్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేతల డిమాండ్
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మూడేళ్ల క్రితం డ్రగ్స్ వాడకానికి సంబంధించి ‘వైట్ చాలెంజ్’ విసిరితే వెనుకాడిన కేటీఆర్.. ఆయన బావమరిది రాజ్ పాకాల ఫాంహౌ్‌సలో రేవ్ పార్టీపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారో సాంకేతికతను ఉపయోగించి పోలీసులు తెలుసుకోవాలని, వాస్తవాలు బయటపెట్టాలన్నారు. యువతను మత్తులో ఉంచి తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ.. రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాజ్ పాకాల తన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్, విదేశీ మద్యంతో పార్టీ ఇవ్వడం రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను ప్రోత్సహించేలా ఉందని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
దీనిపై లోతైన విచారణ జరపాలని, ఇందులో ఎంత పెద్దవారు ఉన్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తుంటే.. కేటీఆర్ అండ్ కో రాష్ట్రాన్ని ‘డ్రగ్స్ స్టేట్’గా మారుస్తున్నారన్నారు. పోలీసుల దాడి జరిగినప్పుడు ఫాంహౌ్‌సలో బడాబాబులు ఉన్నారన్న వార్తలు వస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఎవర్నీ వదలొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఈ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారో వారందరి వివరాలను, సీసీటీవీ ఫుటేజ్‌ని బయటపెట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోందన్న విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిందంతా రేవ్ పార్టీలేనని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. యువతను మత్తుకు బానిసలుగాచేసి వారి జీవితాలను నిర్వీర్యం చేశారన్నారు. కేటీఆర్‌తో సహా అందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్ కోరారు. రాజ్ పాకాల ఫాంహౌ్‌సలో రేవ్ పార్టీపై సమగ్ర విచారణ జరిపించాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత, మహిళా ప్రతినిధులు సైబరాబాద్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ పార్టీలో కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్ కొకైన్ వాడినట్లు నిర్ధారణ అయిందని, దీనిపై కేటీఆర్ స్పందించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్ యాదవ్ డిమాండ్ చేశారు.
జన్వాడ ఫాంహౌ్‌సలో అనుమతి లేకుండా మందు పార్టీ
ఎక్సైజ్ మంత్రి జూపల్లి
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జన్వాడ ఫాంహౌ్‌సలో ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, ఎవరైనా పిర్యాదు చేస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి అని తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫాంహౌ్‌సలో తనిఖీలు నిర్వహించారన్నారు. అక్కడ నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ (విదేశీ మద్యం) స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ విదేశీ మద్యానికి ఎలాంటి ‘డ్యూటీ ఫ్రీ’ బిల్లులు చూపించలేదన్నారు.