Share News

Congress Party: లోక్‌సభ ఎన్నికల్లో సీట్లెందుకు తగ్గాయ్‌?

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:24 AM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గాయన్నదానిపై నిజనిర్ధారణ కోసం పార్టీ జాతీయ నేత కురియన్‌ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ.. బుధవారంరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది.

Congress Party: లోక్‌సభ ఎన్నికల్లో సీట్లెందుకు తగ్గాయ్‌?

  • నేటి నుంచి కురియన్‌ కమిటీ విశ్లేషణ

  • పార్టీ నేతల నుంచి అభిప్రాయాల స్వీకరణ

  • ఈనెల 14 వరకు రాష్ట్రంలోనే మకాం

హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో సీట్లు ఎందుకు తగ్గాయన్నదానిపై నిజనిర్ధారణ కోసం పార్టీ జాతీయ నేత కురియన్‌ నేతృత్వంలో ఏఐసీసీ నియమించిన త్రిసభ్య కమిటీ.. బుధవారంరాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. కమిటీ సభ్యులు కురియన్‌, రఖిబుల్‌ హుసేన్‌లకు పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫహీం, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌లు శంషాబాద్‌ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరో సభ్యుడు పర్గత్‌సింగ్‌.. ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 14 వరకూ రాష్ట్రంలోనే మకాం వేయనున్న కురియన్‌ కమిటీ గురువారం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో సమావేశం కానుంది. ముందుగా పార్టీ ఓటమిపాలైన లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఇన్‌చార్జులు, ఆయా నియోజక వర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు సేకరించనుంది. ఆ తర్వాత పార్టీ ఓటమిపాలైన నియోజకవర్గాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలనూ సేకరించనుంది.


రాష్ట్ర స్థాయిలో పీసీసీ అధ్యక్షుడూ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీలతోనూ కమిటీ సభ్యులు చర్చలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్రంలోని 9లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరుపైనా కురియన్‌ కమిటీ.. అధిష్ఠానానికి నివేదికను సమర్పించనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం రాష్ట్రంలోని 12 లోక్‌సభ సీట్ల పరిధిలో కాగ్రెస్‌ఆధిక్యత ప్రదర్శించగా.. తెలంగాణలోని మైనార్టీ ఓటర్ల శాతం, పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సహజంగా ఏర్పడే వ్యతిరేకత వల్ల తెలంగాణలో పార్టీ 14సీట్లు గెలుచుకుంటుందని ఏఐసీసీ అంచనా వేసింది. ఈ మేరకు టార్గెట్‌ పెట్టుకుని పని చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదేశించారు.


అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8 ఎంపీ సీట్లకే పరిమితమైంది. తెలంగాణ నుంచి ఆశించిన మేరకు సీట్లు రాకపోగా.. 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ సీట్లు రెట్టింపు కావడంపై అసంతృప్తి చెందిన అధిష్ఠానం.. తెలంగాణలో ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంపై కారణాలను విశ్లేషించాలని కురియన్‌ నేతృత్వంలో కమిటీని నియమించింది. అయితే బీఆర్‌ఎస్‌ ఓట్‌ షుర్‌ బీజేపీకి బదిలీ కావడం కాంగ్రెస్‌ ఓటమికి ఓ కారణమని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి.. అధిష్ఠానానికి వివరణ ఇచ్చారు. బలహీనమైన అభ్యర్థుల ఎంపికా ఒక కారణమన్న అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కురియన్‌ కమిటీ విచారణపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


సికింద్రాబాద్‌లో గెలిచేవాడిని: వీహెచ్‌

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ సీటు తనకు ఇచ్చి ఉంటే గెలిచేవాడిననని వి.హన్మంతరావు అన్నారు. పార్టీ టికెట్‌ విషయంలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు సీట్లు తగ్గడంపై కురియన్‌ కమిటీ.. ముందుగా వ్యూహకర్త సునీల్‌ కనుగోలును కలవాలని సూచించారు. ఎనిమిదేళ్లుగా తనకు ఒక్క పదవీ ఇవ్వలేదని, రాజ్యసభకు అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:24 AM