Share News

Sunkishala Project: సుంకిశాల ఘటనకు బాధ్యత మాదే!

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:56 AM

సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్‌ బోర్డుకు తెలిపింది.

Sunkishala Project: సుంకిశాల ఘటనకు బాధ్యత మాదే!

  • ఆయా పనుల పునఃనిర్మాణ వ్యయం భరిస్తాం..

  • షోకాజ్‌ నోటీసులకు నిర్మాణ సంస్థ వివరణ లేఖ

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్‌ బోర్డుకు తెలిపింది. ఈ ఘటనపై ఇంజనీర్ల కమిటీతో విచారణ జరిపిన వాటర్‌ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా నిర్మాణ సంస్థకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనికి నిర్మాణ సంస్థ మూడు పేజీలతో కూడిన వివరణ లేఖను వాటర్‌ బోర్డుకు అందజేసింది. ఈ ఘటన పట్ల సంస్థ విచారం వ్యక్తం చేసింది. ప్రమాదం తలెత్తడానికి గల కారణాలు, లోపాలను పూర్తిగా లేఖలో వివరించినట్లు సమాచారం.


దేశ, విదేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న తమకు ఈ ఘటన మొదటిదని, అన్నీ రకాల భద్రత చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదం జరగడంపై కారణాలను అంతర్గతంగా విచారణ చేసుకున్నట్లుగా లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది. సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు 60శాతానికి పైగా పూర్తయ్యాయని, పంపింగ్‌ మెయున్‌ పనులు 70శాతం, ఎలక్ర్టో మెకానిక్‌ పనులు 40శాతం పూర్తయినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం.


అయితే టన్నెల్‌ గేట్‌ ధ్వంసంతో రిజర్వాయర్‌ వైపు గల సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోవడంతో సంపు, పంప్‌ హౌజ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి ఇబ్బందికరంగా మారిందని, కానీ పంపింగ్‌ మెయిన్‌ పనులు, ఎలక్ర్టో మెకానిక్‌ పనులను ఆపలేదని, చురుగ్గా సాగుతున్నాయని వివరణలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది.


అయితే సైడ్‌ వాల్‌ కూలిపోవడంతో తలెత్తిన పరిణామాలన్నింటికీ నిర్మాణ సంస్థగా తామే బాధ్యత వహిస్తామని, ఆయా పనుల పునఃనిర్మాణ వ్యయం మొత్తం తామే భరిస్తామని, ప్రమాదం నేపథ్యంతో తాజాగా విధించే గడువుకనుగుణంగా సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నీ రకాల చర్యలు చేపడతామని లేఖలో నిర్మాణ సంస్థ వివరించినట్టు సమాచారం.

Updated Date - Aug 16 , 2024 | 03:56 AM