Share News

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి రూ.31 వేల కోట్లు!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:22 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు.

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి రూ.31 వేల కోట్లు!

  • ఉత్తర, దక్షిణ భాగాలకు కలిపి అధికారుల అంచనా వ్యయం

  • 350 కిలోమీటర్ల రోడ్డుకు 4,500 హెక్టార్ల భూమి అవసరం

  • ఉత్తర భాగం నిర్మాణానికి ఆగస్టులో రాష్ట్ర సర్కార్‌ టెండర్లు

  • పరిహారంలో 50ు చెల్లింపు కోసం హడ్కో నుంచి రుణం!

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. రెండు భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.31 వేల కోట్ల మేర నిధులు ఖర్చవుతాయని లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తరభాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో రహదారి స్వరూపాన్ని కూడా ఖరారు చేశారు. మరోవైపు దక్షిణ భాగంపైనా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలైన్‌మెంట్‌పై చర్చలు జరుపుతున్నారు. ఈ వివరాలతో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి 4,500 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గతంలోనే తేల్చారు.


ఇందులో.. ఉత్తర భాగం నిర్మాణానికి 90శాతం భూసేకరణ పూర్తిచేశారు. పరిహారం, నిర్మాణ ఖర్చు విషయంలో అఽధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు దక్షిణ భాగం రహదారి నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని గతంలోనే కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ.. తెలంగాణ జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. దీంతో డీపీఆర్‌ పనులపై అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంపై కృతనిశ్చయంతో ఉంది. గతేడాది డిసెంబరులో సర్కారు చొరవతో ఉత్తర భాగం యుటిలిటీ చార్జీల చెల్లింపు అంశానికి తెరపడింది. దక్షిణ భాగం రోడ్డుకు జాతీయ రహదారి నంబర్‌ను కేటాయించేందుకూ కేంద్రం పచ్చజెండా ఊపింది. కాగా, సంగారెడ్డి- చౌటుప్పల్‌ వరకు 161 కి.మీ మేర నిర్మాణం జరుపుకొనే ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం కోసం రూ.1,940 హెక్టార్ల మేర భూమి అవసరం పడుతోంది.


రోడ్డు నిర్మాణానికి మొత్తం రూ.15 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతున్నాయి. ఇందులో పరిహారానికే రూ.5,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక చౌటుప్పల్‌లో మొదలై సంగారెడ్డికి అనుసంధానమయ్యే దక్షిణ భాగం రహదారి 189 కి.మీ.పరిధిలో ఉంటుంది. ఇందుకు 2వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.16 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతుండగా.. ఇందులో రూ.6,500 కోట్ల నుంచి రూ.7వేల కోట్ల వరకు భూ పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుందని అఽధికారులు తేల్చారు. దీని ప్రకారం మొత్తం 350 కి.మీ. మేర నిర్మితమయ్యే రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.


పరిహారంలో రాష్ట్ర వాటా రూ.6,300 కోట్లు..

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికిగాను ఎన్‌హెచ్‌ఏఐ సేకరించిన భూమికి చెల్లించే మొత్తం భూ పరిహారంలో సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డును మంజూరు చేస్తే భూ పరిహారం చెల్లింపుల్లో 50 శాతాన్ని రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని 2018 ఆగస్టు 29న కేంద్రమంత్రికి అప్పటి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. దాంతో ఉత్తరభాగం భూ సేకరణలో సగం వాటా కింద రూ.2,700 కోట్లు, దక్షిణభాగం భూ సేకరణలో సగం వాటా కింద రూ.3,600 కోట్లు కలిపి మొత్తం దాదాపు రూ.6,300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐకి చెల్లించాలి. దీంతో ఈ మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - Jun 18 , 2024 | 05:23 AM