High Court: ఇంజనీరింగ్ మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించని అధికారులు
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:33 AM
పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు, పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సహా పలువురికి కోర్టు ధిక్కరణ నోటీసులు
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : పలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు, పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, టీజీఈఏపీసెట్ కన్వీనర్‌లకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతించినా డిమాండ్ ఉన్న కోర్సులకు, సీట్లు పెంచుకోవడానికి అనుమతివ్వడం లేదని పేర్కొంటూ పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
వాటిపై గత నెల 9న విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. శ్రీనివాసరావు ధర్మాసనం పిటిషనర్ల కాలేజీల్లో పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తమ ఆదేశాలను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని.. మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరించాలని పేర్కొంటూ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ విచారణ వాయిదా వేసింది.
మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ అమలుపై
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎస్. సంధ్యకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో సదరు పిటిషన్‌ను హైకోర్టు ముగించింది. కాగా రిజర్వేషన్లు అమలుచేయడం లేదని పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.