CPI MLA Koonamnani: చరిత్రను వక్రీకరించినంత మాత్రాన సమసిపోదు: కూనంనేని
ABN , Publish Date - Sep 18 , 2024 | 04:56 AM
కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు.
మగ్డూం భవన్‌లో ఘనంగా తెలంగాణ విలీన దినం వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టు పార్టీ పేరు ఉచ్ఛరించడానికి, కమ్యూనిస్టు చరిత్రను చెప్పడానికి పాలక పార్టీలు భయపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 76వ వార్షికోత్సవం, తెలంగాణ విలీన దినం వేడుకలను సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కూనంనేని జాతీయ జెండాను ఆవిష్కరించగా, జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సాయుధ పోరాట అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, కమ్యూనిస్టుల సారధ్యంలో సామాన్య ప్రజలు తుపాకులు పట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సాగించారని, ఈ మహత్తర పోరాట చరిత్రను వక్రీకరించినంత మాత్రాన సమసిపోదని అన్నారు. ప్రజాపాలన దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం, విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తూ ఆనాటి మహత్తర చరిత్రను భావి తరాలకు తెలియకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.
రాజ్యాంగంలో రాసిన విలీనం అనే పదాన్ని పలకడానికి పాలక పార్టీలకు భయం ఎందుకని కూనంనేని ప్రశ్నించారు. అనంతరం అజీజ్‌పాషా మాట్లాడుతూ, సాయుధ పోరాటం ద్వారా మూడొంతుల తెలంగాణ ప్రాంతం కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చిందన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో చిన్న, సన్నకారు, కౌలు రైతుల ప్రయోజనాల కోసం పాలకులు పని చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ అన్నారు.