Share News

Yadadri: యాదగిరిగుట్టలో ‘గిరి ప్రదక్షిణ’

ABN , Publish Date - Jun 16 , 2024 | 03:45 AM

మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది.

Yadadri: యాదగిరిగుట్టలో ‘గిరి ప్రదక్షిణ’

  • అరుణాచలం, సింహాచలం తరహాలో అందరికీ చాన్స్‌

  • ఈనెల 18న ఉదయం 5.30 గంటలకు ప్రారంభం

యాదాద్రి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే 2016లో ఆలయాన్ని పునర్నిర్మించడంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గిరిప్రదక్షిణ చేసేందుకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే యాదగిరిగుట్టలో ఉన్న పాత ఆచారాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామివారికి ఇప్పటివరకు స్థానిక భక్తులే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.


ఇక నుంచి అరుణాచలం, సింహాచలం తరహాలో భక్తులందరికీ గిరి ప్రదక్షిణ అవకాశాన్ని కల్పించాలని యాదగిరిగుట్ట అధికారులు సంకల్పించారు. స్వామివారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన స్వాతినక్షత్రం పురస్కరించుకుని ఉదయం 5.30గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు ఐదు వేల మందితో ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు అధికారులు నిర్ణయించారు.

Updated Date - Jun 16 , 2024 | 03:45 AM