Cyber Crime: నగ్నంగా వీడియో కాల్
ABN , Publish Date - Dec 22 , 2024 | 05:19 AM
డిజిటల్ అరెస్టు పేరు చెప్పగానే భయపడ్డ ఓ బాధితురాలికి సైబర్ కేటుగాడు లైంగికంగా వేధించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో కేసులో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది.
డిజిటల్ అరెస్టులో.. సైబర్ కేటుగాడి హుకుం
భయంతో ఫిర్యాదుకు బాధితురాలి వెనుకంజ
మరో కేసు దర్యాప్తులో.. వెలుగులోకి తతంగం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు పేరు చెప్పగానే భయపడ్డ ఓ బాధితురాలికి సైబర్ కేటుగాడు లైంగికంగా వేధించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో కేసులో పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాదికి చెందిన ఓ యువతి, హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేస్తూ.. స్నేహితులతో కలిసి ఉంటోంది. కొంతకాలం క్రితం ఆ యువతికి సైబర్ కేటుగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. డిజిటల్ అరెస్టు మోసాల్లో భాగంగా ఓ కేటుగాడు పోలీసు యూనిఫాంలో ఆ యువతికి వీడియోకాల్ చేసి, ‘‘మీ పేరిట వచ్చిన ఓ పార్సిల్‌లో డ్రగ్స్ వచ్చాయి’’ అని బెదిరించాడు. బాధితురాలి కుటుంబసభ్యుల వివరాలు, ఆమె జరిపే ఆన్‌లైన్ పేమెంట్ల చిట్టాను వాట్సా్‌పలో పంపి.. ఎఫ్‌ఐఆర్ కాపీని చూపాడు. దాంతో ఆ యువతి భయపడిపోవడంతో.. నగ్నంగా మారాలంటూ వేధించాడు. కేటుగాడు చెప్పినట్లు చసినా.. వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు నిందితుల ఫోన్ ఎత్తడం మానేసింది. పోలీసులు ఇటీవల ఓ డిజిటల్ అరెస్టు కేసులో నిందితులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది.