Share News

Damodara: అనారోగ్యంతో ఎవరూ అప్పులపాలు కావొద్దు!

ABN , Publish Date - Dec 02 , 2024 | 04:05 AM

సర్కారీ వైద్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు అప్పులపాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

Damodara: అనారోగ్యంతో ఎవరూ అప్పులపాలు కావొద్దు!

  • అదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

  • సర్కారీ వైద్యంపై నమ్మకం పెంచాం

  • ఏడాదిలో ఓపీ, ఐపీ 10 రెట్లు

  • జనాభా ఆధారంగా సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు

  • ఉద్యోగులు కోరినట్లు ఈహెచ్‌ఎస్‌ వైద్య కళాశాలల్లో 600 అసిస్టెంట్‌

  • ప్రొఫెసర్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌

  • ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సర్కారీ వైద్యంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు అప్పులపాలు కావొద్దన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. సబ్‌ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నింటినీ బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రి ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాది కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి పెంచడంతో పాటు వైద్యులు, నర్సుల సంఖ్యను భారీగా పెంచామని చెప్పారు. సర్కారీ దవాఖానాల్లో యుద్ధ ప్రాతిపదికన నియామక ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది కాలంలో అన్ని వైద్య కళాశాలల్లో ఓపీ, ఐపీ పదిరెట్లు పెరగడమే దీనికి నిదర్శనమని చెప్పారు.


  • ఏడాదిలో ఎటువంటి విజయాలు సాధించారు?

ప్రజలు అనారోగ్యం వల్ల అప్పులు పాలు కావొద్దన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిఽఽధిలోకి తెచ్చాం. ఈ పథకం కింద ప్రతి నెలా సగటున రూ.76 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైద్యశాఖలో 7774 ఉద్యోగాలను ఏడాదిలోపే భర్తీ చేశాం. మరో 6470 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గత ప్రభుత్వం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకోగా, మేం వచ్చాక 8 మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాం. అదనంగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు మన పిల్లలకు వచ్చాయి. కొడంగల్‌లో కొత్త మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ఏడాదిలోపే 16 నర్సింగ్‌ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాం. 28 పారామెడికల్‌ కాలేజీలను ప్రారంభించుకుంటున్నాం. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త భవనాన్ని 32 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో నిర్మించబోతున్నాం. త్వరలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం. కిడ్నీ విఫలమైన రోగుల కోసం మరో 18 డయాలసిస్‌ సెంటర్లతో పాటు కొత్తగా 7 వాస్క్యులర్‌ కేంద్రాలను మంజూరు చేశాం.


  • కొత్త పథకాలు తీసుకురాబోతున్నారా?

ఉన్నవి పకడ్బందీగా అమలు చేస్తాం. రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి జిల్లాలో స్ర్కీనింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. మొబైల్‌ స్ర్కీనింగ్‌ కేంద్రాలను తీసుకురావాలనుకుంటున్నాం. జనాభా సంఖ్య ఆధారంగా అన్ని జిల్లాల్లో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు, ఏరియా ఆస్పత్రులతో పాటు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయబోతున్నాం. గర్భిణులకు ఇచ్చే ఎంసీహెచ్‌ కిట్‌లో మార్పులు తీసుకొస్తున్నాం.

  • ఈహెచ్‌ఎస్‌ అమలు కావడం లేదంటున్నారు?

ఉద్యోగులు పదేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం మా దృష్టిలో ఉంది. ఈహెచ్‌ఎ్‌సను వారు కోరుకున్నట్లుగా అమలు చేస్తాం. భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా, కొత్త వ్యవస్థను రూపొందిస్తాం.

  • వైద్యవిద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది కదా?

కేవలం కాగితాలపై జీవోలిచ్చి అద్దె భవనాలు ఏర్పాటు చేస్తే ఆస్పత్రులు, కాలేజీలు ఏర్పాటు చేసినట్లు కాదు. ప్రజలకు వైద్యం అందాలంటే వైద్యులు, నర్సులు, ఇతర అన్ని రకాల సిబ్బంది కావాలి. మేం అధికారంలోకి వచ్చే నాటికి మానవ వనరుల కొరత ఉన్నది వాస్తవం. ఈ ఏడాది కాలంలో పోస్టుల భర్తీ ప్రక్రియను వేగిరం చేశాం. 6 నెలల్లో నియామక ప్రక్రియ అంతా పూర్తవుతుంది. త్వరలో 600కు పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయబోతున్నాం. తాత్కాలికంగా బోధనాస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులను నియమించాం. సాధారణ బదిలీల తర్వాత కొందరు తప్పుడు ప్రచారం చేసి, లబ్ధి పొందే యత్నం చేస్తున్నారు. అలాంటి వాటిని పట్టించుకోం.

  • తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ను సెకండరీ కేర్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌గా మార్చే ఆలోచన ఉందా?

ఉంది. దానిపై కసరత్తు చేస్తున్నాం. భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా బలమైన వ్యవస్థ ఉండేలా అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ నిపుణులతో అధ్యయనం చేయించాం. వారి ప్రతిపాదనలపై సమీక్ష చేశాం. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం.

  • సర్కారీ దవాఖానాల్లో మందుల్లేవనే వార్తలు తరచూ వస్తున్నాయి?

ఆ ప్రచారం అవాస్తవం. రోగులకు అవసరమైన అన్ని ఔషధాలను ఆస్పత్రులకు అందజేస్తున్నాం. ఇండెంట్‌ దగ్గర్నించి రోగులకు చేరే వరకు ఆన్‌లైన్‌లో అన్ని వివరాలూ నమోదయ్యేలా చూస్తున్నాం.

Updated Date - Dec 02 , 2024 | 04:05 AM