Share News

Medical Education: పదోన్నతులకు మోక్షమెప్పుడు?

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:56 AM

వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిఽధిలో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. పదోన్నతులు, పదవుల భర్తీ... వంటి నిర్ణయాలన్నీ నత్తనడకను తలపిస్తున్నాయి.

Medical Education: పదోన్నతులకు మోక్షమెప్పుడు?

  • డీఎంఈ పరిఽధిలో నత్తనడకన నిర్ణయాలు.. ఇన్‌చార్జిల పాలనలోనే మెడికల్‌ కాలేజీలు

  • సూపరింటెండెంట్ల భర్తీలోనూ తీవ్ర జాప్యం

  • డైటీషియన్‌, బయోకెమిస్ట్‌, లైబ్రేరియన్‌ వంటి పోస్టులన్నీ పదోన్నతులతో భర్తీ చేయాల్సినవే

  • పదేళ్లుగా మారని తీరు.. కోర్టుకెక్కిన ఉద్యోగులు

హైదరాబాద్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. పదోన్నతులు, పదవుల భర్తీ... వంటి నిర్ణయాలన్నీ నత్తనడకను తలపిస్తున్నాయి. సర్కారు మారినా తమ తలరాతలు మారలేదని, బీఆర్‌ఎస్‌ సర్కారు హయాం నాటి పరిస్థితే ఇప్పటికే కొనసాగుతోందని చిరుద్యోగులు వాపోతున్నారు. ముఖ్యంగా డైటీషియన్స్‌, బయోకెమిస్ట్‌, లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులను పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉన్నా.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తున్నారు. ఏటా హడావుడిగా పదోన్నతుల ఫైలు పెట్టడం, ప్యానెల్‌ ఇయర్‌ ముగిసే దాకా సాగదీయడం, ఆ తర్వాత మళ్లీ పక్కన పెట్టడమనేది ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఏడాది కూడా డీఎంఈ అధికారులు అదే తంతు కొనసాగించారు. దీంతో ఈ విషయమై పది మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో డీఎంఈ వాణికి వ్యక్తిగతంగా నోటీసులు అందే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు. వాస్తవానికి డీఎంఈ పరిధిలో 34 మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని నీలోఫర్‌, పేట్ల బురుజు, చెస్ట్‌, మానసిక ఆస్పత్రులు డీఎంఈ పరిధిలోకే వస్తాయి. ఈ మెడికల్‌ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులకు ఇప్పటి వరకు రెగ్యులర్‌ ప్రిన్సిపాల్స్‌, సూపరింటిండెంట్స్‌ను నియమించలేదు. ఈ పోస్టులను అడిషనల్‌ డీఎంఈ హోదా ఉన్న వారితోనే భర్తీ చేయాల్సి ఉండగా.. ఇన్‌చార్జిల పాలనతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం అడిషనల్‌ డీఎంఈలు 17 మందే ఉన్నారు.


మరో 47 మందికి అడిషనల్‌ డీఎంఈలుగా పదోన్నతి కల్పించాల్సి ఉన్నా.. ఆ ఫైలు నెలలుగా పెండింగ్‌లోనే ఉంది. బోధనాస్పత్రుల్లోని డైటిషీయన్స్‌ పోస్టులను పదోన్నతులతోనే భర్తీ చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఆ పోస్టుల జోలికి వెళ్లలేదు. 34 బోఽధన ఆస్పత్రులు ఉంటే... ఇద్దరు, ముగ్గురు డైటీషియన్స్‌ మాత్రమే పని చేస్తున్నారు. ప్రస్తుతం 42 డైటిషీయన్స్‌, 27 బయోకెమిస్టు, 44 లైబ్రేరియన్‌, 22 అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ ప్రమోషన్స్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉండగా... పదేళ్లుగా నాన్చుతున్నారు.


ఈ విషయమై అర్హులైన అభ్యర్థులందరూ ఇప్పటికే వైద్య మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి.. ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన ఆయన వెంటనే పదోన్నతులు చేపట్టాలని డీఎంఈను ఆదేశించారు. కానీ, నెలలు గడుస్తున్నా.. ఆ ఆదేశాలను పట్టించుకున్న వారే లేరన్న వాదన వినిపిస్తోంది. పదోన్నతుల జాబితాలో ఉన్న వారి స్టడీ సర్టిఫికెట్లు నకిలీవని, విభాగాధిపతుల నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదన్న కారణం చూపుతూ ఇన్నేళ్లుగా పదోన్నతులను నిరాకరిస్తూ వస్తున్నారు. ప్రస్తుత డీఎంఈ కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 21 , 2024 | 03:56 AM