Medical Health: వైద్య శాఖకు ఇన్‌చార్జిల జాడ్యం!
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:34 AM
తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా కీలక విభాగాలకు ఇంకా ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను ఇన్‌చార్జిల జాడ్యం వీడడం లేదు.
పదేళ్లు దాటినా రెగ్యులర్ హెచ్‌వోడీల్లేరు
కీలక విభాగాలన్నింటిల్లో ఇదే పరిస్థితి
9నెలల క్రితం సీఎంవో చెప్పినా అదే తీరు
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటినా కీలక విభాగాలకు ఇంకా ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖను ఇన్‌చార్జిల జాడ్యం వీడడం లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. కనీసం విభాగాధిపతుల పోస్టులను క్రియేట్ చేయలేదు. పదేళ్లపాటు ఇన్‌చార్జి అధికారులతోనే కాలం వెళ్లదీసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఆ పరిస్థితి మారలేదు. ఎట్టకేలకు హెచ్‌వోడీ పోస్టులను మంజూరు చేసినా.. కూడా రెగ్యులర్ విభాగాఽధిపతులను నియమించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలోని వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ), రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్), తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ పదవుల్లో ఇప్పటికీ ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతుండడంపై సీనియర్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ హయంలో ఉన్న ఇన్‌చార్జిలను తొలగించింది.
డీఎంఈగా పనిచేస్తున్న డాక్టర్ రమేశ్‌రెడ్డిని గత ఏడాది డిసెంబరు 20న తప్పించి.. డాక్టర్ త్రివేణికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ఫిబ్రవరి 20న ఆమె స్థానంలో డాక్టర్ వాణిని ఇన్‌చార్జి డీఎంఈగా నియమించింది. ఇప్పటికి పది నెలలు గడుస్తున్నా.. రెగ్యులర్ డీఎంఈని నియమించకపోవడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిపార్టమెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదంతో రెగ్యులర్ డీఎంఈ నియామక ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా... ఇన్‌చార్జితోనే సర్కారు నెట్టుకొస్తోంది. మరోవైపు.. 2014 నుంచి నేటి దాకా ఇన్‌చార్జి డీహెచ్‌లుగా ఏడుగురు పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీనియారిటీలో జాబితాలో ముందు ఉన్న డాక్టర్ రవీంద్రనాయక్‌కు ఆ పదవీ బాధ్యతలు అప్పగించింది.
ఈ ఏడాది జరిగిన ఉద్యోగుల సాధారణ బదిలీల్లో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బదిలీల్లో సీనియారిటీ పాటించలేదని, ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు ఇవ్వడం వెనుక డబ్బులు చేతులు మారాయని విజిలెన్స్ కూడా సర్కారుకు నివేదించింది. దీంతో డీహెచ్‌తోపాటు కార్యాలయంలోని పలువురికి చార్జిమెమోలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని డీహెచ్ పోస్టులో ఎలా కొనసాగిస్తార్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక నర్సింగ్ కౌన్సిల్‌ది మరీ దారుణం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి దాకా ఒక్కరే ఆ పోస్టులో కొనసాగుతున్నారు. అది కూడా ఇన్‌చార్జిగానే కావడం గమనార్హం. గత ప్రభుత్వం నియమించిన వారినే కాంగ్రెస్ సర్కారు కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
అప్పట్లోనే సీఎంవో వివరణ.. అయినా అదే తీరు
వైద్య శాఖకు ఇన్‌చార్జిలే దిక్కు అవుతున్నారంటూ ఈ ఏడాది మార్చి 24న ‘ఆంధ్రజ్యోతి’లో ‘వైద్యానికి ఇన్‌చార్జిలు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై సీఎంవో స్పందించింది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖలోని విభాగాధిపతుల పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. జనవరి 29న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైద్యశాఖపై సమీక్ష నిర్వహించారని వెల్లడించింది. అందులోనే ప్రజారోగ్య సంచాలకులు, టీవీవీపీ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ హెచ్‌వోడీ పోస్టులను క్రియేట్ చేయని విషయం సీఎం దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అదే రోజు పోస్టులు క్రియేట్ చేయాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారని వెల్లడించింది. ఇప్పటికే డీఎంఈ పోస్టును క్రియేట్ చేశామని, పదోన్నతి ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ వివరణ ఇచ్చి కూడా సరిగ్గా తొమ్మిది నెలలు అవుతోంది. అయినప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలో ఏ మార్పూ కనిపించడం లేదు. రెగ్యులర్ వద్దు... ఇన్‌చార్జిలే ముద్దు అన్న చందంగా వ్యవహరిస్తోంది.