Share News

District Collectors: కలెక్టర్లు కదలాలి..

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:39 AM

జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది.

District Collectors: కలెక్టర్లు కదలాలి..

  • క్షేత్రస్థాయిలో పర్యటించాలి

  • స్కూళ్లు, ఆస్పత్రులను తనిఖీ చేయాలి

  • తాగునీరు, పారిశుధ్యం పరిశీలించాలి

  • పింఛన్ల అమలును సమీక్షించాలి

  • ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి

  • అధికారులూ పర్యటించేలా చూడాలి

  • అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం

  • 5లోపు ‘టూర్‌డైరీ’ సీఎస్‌కు పంపాలి

  • పనితీరుతోనే రివార్డులు, పనిష్మెంట్లు

  • స్పష్టం చేసిన సర్కారు.. ఉత్తర్వులు

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్లు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది. లబ్ధిదారులతో, స్థానిక ప్రభుత్వ సిబ్బందితో మమేకం కావాలని, వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి... పథకాలు, కార్యక్రమాలు ఏ మేరకు చేరుతున్నాయి, లక్ష్యసాధనలో ఆయా పథకాలు ఎంతవరకు సఫలీకృతమవుతున్నాయన్న వివరాలు సేకరించాలని నిర్దేశించింది. ఈ వివరాలన్నింటితో ప్రతి నెలా 5వ తేదీలోగా ‘టూర్‌ డైరీ’ రూపంలో సీఎస్‌కు నివేదిక పంపాలని ఆదేశించింది.


ఈ పర్యటనల వల్ల గ్రామీణ సమూహాలకు అందుతున్న సంక్షేమం ద్విగుణీకృతం అవుతుందని, ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొంది. కలెక్టర్ల పనితీరును అంచనా వేసే సందర్భంలో వారి క్షేత్రస్థాయి పర్యటనలు, నిబద్ధత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. దీని ఆధారంగా రివార్డులు, పనిష్మెంట్లు ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ముఖ్యంగా 10 ప్రధాన అంశాలను పరిశీలించాలని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించారు.


ఆరోగ్యం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, జిల్లా ఆస్పత్రుల పనితీరును తనిఖీ చేయాలి. ప్రజలకు ఆరోగ్య సేవలు ఎలా అందుతున్నాయి? వంటి వివరాలను పరిశీలించాలి.

విద్య: పాఠశాలలను తనిఖీ చేసి.. విద్యార్థులు ఏ మేరకు నేర్చుకుంటున్నారు? ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటున్నారా? మధ్యాహ్న భోజనంఎలా ఉంది? వంటివి అంచనా వేయాలి. దరిదాపుల్లోని హాస్టళ్లను కూడా తనిఖీ చేయాలి.

నీటి సరఫరా, పారిశుధ్యం: సురక్షిత నీరు ప్రజలకు అందుబాటులో ఉందా? పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంది? మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించాలి.

వ్యవసాయం: విత్తనాలు, ఎరువుల సరఫరాను తనిఖీ చేయాలి.

ప్రజా పంపిణీ వ్యవస్థ: లబ్ధిదారులకు బియ్యం, సరుకులు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించాలి.

గృహనిర్మాణ పథకాలు: ఇందిరమ్మ ఇళ్లు, ఇతర ప్రభుత్వ పథకాల కింద ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల నాణ్యత, నిర్మాణ దశలను తనిఖీ చేయాలి.

రోడ్లు, మౌలిక సదుపాయాలు: రోడ్ల పరిస్థితి, ప్రజా రవాణా, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిని సమీక్షించాలి.

సాంఘిక సంక్షేమం: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పింఛన్ల వంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమలుతీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.

మునిసిపాలిటీలు: పురపాలక సంస్థల పరిధిలో పైన చెప్పిన అన్ని కార్యక్రమాలు, పథకాలు అమలవుతున్నాయా లేదా చూడాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీటి సరఫరా, టౌన్‌ ప్లానింగ్‌ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మహిళా శిశు సంక్షేమం: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, శిశువులకు అందుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను తనిఖీ చేయాలి.


  • ఆకస్మిక తనిఖీలు జరపాలి

ఆకస్మిక తనిఖీల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలను కలెక్టర్లు అంచనా వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఈ నెల 2న అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లేలా చూడాలంటూ ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jul 13 , 2024 | 03:39 AM