Share News

Kamareddy: లింగ నిర్ధారణ దందా.. శిశువు విక్రయం

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:59 AM

ఆ ఇద్దరు వైద్యులు తండ్రీకొడుకులు! చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో అనేది సంబంధీకులకు చెప్పేస్తారు. పైగా.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు.

Kamareddy: లింగ నిర్ధారణ దందా.. శిశువు విక్రయం

  • ప్రమాదమని తెలిసీ ఎనిమిదో నెల్లోనే కాన్పు

  • కామారెడ్డిలో తండ్రీకొడుకులైన వైద్యుల నిర్వాకం

  • కొడుకు ప్రభుత్వ వైద్యుడు

  • వారితో పాటు ఆరుగురి అరెస్టు

  • రూ.2 లక్షలకు ఆడశిశువును అమ్మిన వైనం

కామారెడ్డి టౌన్‌, జూలై 6: ఆ ఇద్దరు వైద్యులు తండ్రీకొడుకులు! చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. పుట్టబోయేది ఆడబిడ్డో, మగబిడ్డో అనేది సంబంధీకులకు చెప్పేస్తారు. పైగా.. ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా ఇటీవల 8 నెలల గర్భిణికి కాన్పు చేశారు. ఆ శిశువును బేరం పెట్టి అమ్మేశారు! కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇట్టెం సిద్ధిరాములు, ఇట్టెం ప్రవీణ్‌ అనే వైద్యుల నిర్వాకమిది. ప్రవీణ్‌ ప్రభుత్వ వైద్యుడు. గాంధారి మెడికల్‌ ఆఫీసర్‌గా చేస్తున్నాడు. తండ్రి సిద్ధిరాములతో కలిసి కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. సిద్ధిరాములు, ప్రవీణ్‌ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తేలడంతో వారు కౌసల్య అనే పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిని గతంలోనే అధికారులు సీజ్‌ చేశారు. కోర్టులో ఈ కేసు విచారణ నడుస్తోంది.


కొన్నాళ్లకు వారు వైద్య శాఖలో కొందరు అధికారులను మచ్చిక చేసుకుని ‘సమన్విత హాస్పిటల్‌ అండ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌’ను తెరిచారు. లింగనిర్ధారణ పరీక్షలతో యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. తాజాగా 8 నెలల గర్భిణీకి కాన్పు చేయడం, శిశువును విక్రయించడంతో వారి బండారం బయటపడింది. తాడ్వాయి మండలానికి చెందిన ఆ యువతికి, రామారెడ్డి మండలానికి చెందిన యువకుడికి 8 నెలల క్రితం పెళ్లయింది. తర్వాత రెండు నెలలకు భార్య గర్భిణి అనే సంగతి తెలుసుకొని భర్త, ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించాడు. పరీక్షల్లో ఆమె 8 నెలల గర్భవతి అని తేలడంతో ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె, ఆమె కుటుంబ సభ్యులు సమన్విత ఆస్పత్రిలో వైద్యులు ప్రవీణ్‌, సిద్ధిరాములను సంప్రదించారు. ఇదే అదనుగా వారు లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అని తేల్చారు. నెలలు నిండకుండా కాన్పు చేయడం ప్రమాదమని తెలిసి కూడా అందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 11న ఆమెకు కాన్పు చేశారు.


ఆడపిల్ల పుట్టింది. ఆ పసికందును రూ.2 లక్షలకు అమ్మేందుకు వైద్యులు తమ ఆస్పత్రి మేనేజర్‌ ఉదయ్‌కిరణ్‌, సిబ్బందితో కలిసి సిరిసిల్లా జిల్లాకు చెందిన భూపతితో ఒప్పందం కుదుర్చుకున్నారు. బయానాగా భూపతి రూ.20 వేలు సదరు మేనేజర్‌, వైద్యులకు ఇచ్చి పసికందును తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువతి తన భర్త ద్వారానే గర్భం దాల్చానంటూ అతనికి లీగల్‌ నోటీసు పంపింది. దాంతో అతను శిశువు విక్రయం గురించి హైదరాబాద్‌లోని శిశు సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి జిల్లా శిశు సంరక్షణ జిల్లా అధికారి స్రవంతి, అక్కడి పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు.


ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. వైద్యులు ప్రవీణ్‌, సిద్ధిరాములుతో పాటు శిశువు తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా పసికందును విక్రయించినట్లు తేలింది. వారితో పాటు శిశువును కొన్న భూపతిని, ఆస్పత్రి మేనేజర్‌ ఉదయ్‌కిరణ్‌, సిబ్బంది బాలరాజ్‌, బాలకిషన్‌, దేవయ్యను రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శిశువును శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు. కామారెడ్డిలో గత కొన్నేళ్లుగా ఇట్టెం ప్రవీణ్‌, సిద్ధిరాములు తమ సమన్విత హాస్పిటల్‌ అండ్‌ పెర్టిలిటీ సెంటర్‌లో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పట్టణ సీఐ తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 03:59 AM