Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌ డబ్బులు పంచుతోంది..

ABN , Publish Date - May 13 , 2024 | 03:35 AM

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, హాఫ్‌ బాటిల్‌ మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ డబ్బులు పంచుతోంది..

  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ: సంజయ్‌

  • ‘మెదక్‌’లో బీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా నగదు పంపిణీ

  • ఆ పార్టీ అభ్యర్థికి పొంగులేటి పైసలు: రఘనందన్‌

హైదరాబాద్‌/మెదక్‌ అర్బన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, హాఫ్‌ బాటిల్‌ మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు, మండలాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తన కార్యాలయానికి ఫోన్లు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ పైసలు పంచి అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందన్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున డబ్బులను డంప్‌ చేశారని తెలిపారు. ‘‘కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తోంది.


ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, ఇంటికి హాఫ్‌ బాటిల్‌ మద్యం చొప్పున 15 లక్షల మందికి పంపిణీ చేస్తూ ఓట్లను కొని గెలవాలని అడ్డదారులు తొక్కుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. అధికారులు, పోలీసుల సహకారం లేకుండా ఇంటింటికీ డబ్బుల పంపిణీ సాధ్యమా..? కళ్లముందే డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా ఎన్నికల కమిషన్‌ చోద్యం చూడటం వెనుక మర్మమేంటి..? డబ్బు, మద్యం పంపిణీపై బీజేపీ కార్యకర్తలు సీ విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోకపోగా ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌ నేతలకు పంపి వారిని కాపాడే ప్రయత్నం చేయడం బాధాకరం. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్‌ ఎందుకు..?’’ అని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు: రఘునందన్‌

సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడంపై పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆదివారం మెదక్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోసం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సహాయ సహకారాలతో ఓటుకు రూ.500, రూ.1,000 పంచుతున్నారని ఆరోపించారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి దొంగా పోలీసుల్లా వ్యహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలను పిలిచి డబ్బులు ఇచ్చి పంపిణీ చేయిస్తున్నట్లు డీఎస్పీ, సీపీకి చెప్పినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపించారు. శనివారం రాత్రి పెద్ద శివనూర్‌, చిన్న శివనూర్‌ మధ్యలో ఉన్న ఫాంహౌ్‌సలో బీఆర్‌ఎస్‌ నాయకులు 15 కార్లలో వచ్చి ఏ బూత్‌కు ఎన్ని డబ్బులు పంపిణీ చేయాలని సమావేశమయ్యారని తెలిపారు. చేగుంట ఎస్‌, రామాయంపేట సీఐ, తూప్రాన్‌ డీఎస్పీకి సమాచారం ఇచ్చినా ఎవరూ రాలేదని.. రాత్రి పది గంటలకు జిల్లా ఎస్పీకి సమాచారం అందిస్తే రెండు గంటలు ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. అన్ని కార్లు వెళ్లిపోయిన తర్వాత ఒక కారును రోడ్డుపై నిలిపి అందులో రూ.88.40 లక్షలు దొరికినట్లు చెబుతున్నారని అన్నారు. దొరికిన డబ్బుల కవర్లలో ఏ బూత్‌కు ఎన్ని పంపిణీ చేయాలో రాశారని, అక్కడ సమావేశమైన వారు బీఆర్‌ఎస్‌ నాయకులని చెబుతున్నా వారిపై కేసులు పెట్టలేదన్నారు. ఫాంహౌ్‌సలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 13 , 2024 | 03:35 AM