Share News

ED Arrest: 700 మంది నుంచి రూ.360 కోట్లు వసూలు!

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:48 AM

సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు.

ED Arrest: 700 మంది నుంచి రూ.360 కోట్లు వసూలు!

  • రేరా, హెచ్‌ఎండీఏ తదితర అనుమతులు లేకుండానే నిర్మాణాలకు ముందుకు.. ఈడీ విచారణలో వెల్లడి

  • ప్రజలను నమ్మించి మోసగించినట్టు ఆధారాల సేకరణ

  • ఎట్టకేలకు ‘సాహితీ’ లక్ష్మీనారాయణ అరెస్ట్‌... 14 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బి.లక్ష్మీనారాయణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ప్రపంచస్థాయి విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాస సముదాయాల నిర్మాణం పేరుతో 700 మంది నుంచి సుమారు రూ.360 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ విచారణలో తేలింది. రేరా, హెచ్‌ఎండీఏతోపాటు ఇతర ప్రభుత్వ సంస్థల అనుమతులు లేకుండానే నిర్ణీత సమయంలో నివాస సముదాయాలు నిర్మించి ఇస్తామని ప్రజల్ని నమ్మించి మోసగించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు.


వందల కోట్ల అక్రమాలకు సంబంధించి విచారణకు హాజరుకావాల్సిందిగా లక్ష్మీనారాయణకు పలుమార్లు నోటీ్‌సలు జారీ చేసినా.. ప్రతిసారి ఆరోగ్యం సరిగ్గాలేదని నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్లు ఇచ్చి తప్పించుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉన్న నిందితుడ్ని ఎట్టకేలకు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం సోమవారం అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా అక్టోబరు 14 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో లక్ష్మీనారాయణను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడ్ని 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదికి సూచించిన న్యాయమూర్తి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. వందలాది మంది నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల్ని లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లోకి దారిమళ్లించినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాగా సాహితీ ఇన్‌ఫ్రాపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు గతంలో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈడీ గతంలో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.161 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు అటాచ్‌ చేసింది. తాజాగా లక్ష్మీనారాయణను విచారించి అరెస్ట్‌ చేసింది.

Updated Date - Oct 01 , 2024 | 04:48 AM