KTR: 7న విచారణకు రండి
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:06 AM
ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు.
ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ సమన్లు
2, 3 తేదీల్లో అర్వింద్, బీఎల్‌ఎన్ రెడ్డిల విచారణ
హవాలా, ఫెమా చట్టాల కింద..
విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపుపై ప్రశ్నలు
ముగ్గురి ఫోన్లను ఈడీ సీజ్ చేసే అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. జనవరి 7న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఇదే కేసుకు సంబంధించి నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను జనవరి 2న, హెచ్‌ఏండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఈ నెల 20న అధికారులు కేటీఆర్‌ను ఏ1గా, అర్వింద కుమార్‌ను ఏ2గా, బిఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ మనీ లాండరింగ్, ఫెమా చట్టాల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్) నమోదు చేశారు. ఆ తర్వాత పరిణామాల్లో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈడీ మెల్లిగా ఆధారాల సేకరణ ప్రారంభించింది.
విదేశాలకు డబ్బు బదిలీ చేసిన హిమాయత్‌నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఫిర్యాదు దారుడైన పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదు కాపీని, ఆయన ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని సేకరించారు. బ్రిటన్‌కు చె ందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎ్‌ఫఈఓ) సంస్ధతో నాటి పురపాలక శాఖ ఒప్పందం చేసుకుంటే హెచ్‌ఎండీఏ జనరల్ ఖాతా నుంచి డబ్బు ఎందుకు పంపించాల్సి వచ్చింది? విదేశీ కంపెనీతో ఒప్పందాలు జరిగినపుడు తీసుకోవాల్సిన అనుమతులు తీసుకున్నారా? విదేశీ కరెన్సీలో రెండు విడతలుగా రూ.45,71,60,625కోట్లు చెల్లింపు చేసినపుడు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకున్నారా లేదా అనే కోణంలోనూ ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ సందర్భంగా దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో... ఫార్ములా ఈ కారు రేసు ప్రాజెక్టు ఒప్పందంలో నిబంధనలు తుంగలో తొక్కారని, కేబినెట్, ఆర్ధిక శాఖ, గవర్నర్ అనుమతులు లేకుండా కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులను విదేశీ కంపెనీకి చెల్లించారని... ఏసీబీ స్పష్టం చేసింది. వీటికి సంబంధించిన అన్ని పత్రాలను ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించి పెట్టుకున్నారు.
వ్యూహత్యకంగానే ముందు అర్వింద్ కుమార్ విచారణ
నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లే చేశానని ఇప్పటికే తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రాతపూర్వకంగాజవాబు ఇచ్చిన అర్వింద్ కుమార్‌ను కేటీఆర్ కన్నా ముందే విచారించడానికి సమన్లు జారీ చేయడం వ్యూహత్మకమే. కేటీఆర్ చెప్పినట్లు చేసినందుకు తాను చిక్కుల్లో ఇరుక్కున్నానని, తనను బయట పడేయాలని అర్వింద్ కుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు పైరవీలు చేస్తున్న క్రమంలో ఆయన్ను విచారిస్తే కేసు స్వరూపం పూర్తిగా అర్ధం చేసుకోవచ్చునని, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాటి ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించవచ్చని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని సరోజినీనగర్ సింగల్ రూంలో జీవితాన్ని ప్రారంభించిన బిహారీ ఐఏఎస్ అర్వింద్ కుమార్ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించారని ఆరోపణలున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు సెకండ్ దఫా కార్యక్రమం నుంచి ప్రమోటర్ తప్పుకోవడంతో ఎఫ్‌ఈవో కంపెనీ ప్రతినిధులు ముందుగా అర్వింద్ కుమార్‌తోనే ఫోన్, ఈ మెయిల్ ద్వారా సంభాషణలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వమే ప్రమోటర్ బాధ్యతలు స్వీకరించేలా చూడాలని ఆయన్ని కోరారు. తర్వాత అర్వింద్‌కుమార్ ఈ విషయాన్ని కేటీఆర్‌కు చేరవేశారు. కేటీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గత ఏడాది సెప్టెంబర్ 27న ఫార్ములా ఇ రేసుకు సంబంధించి ఫైల్‌ను తయారు చేసి ఆయన దగ్గరకు పంపారు.
సెప్టెంబరు 27న పురపాలక శాఖ నుంచి మంత్రి కేటీఆర్ దగ్గరకు ఫైల్ వెళితే అంతకు రెండు రోజుల ముందే ఎఫ్‌ఈఓ నుంచి అంటే 25వ తేదీనే 22.7 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ ఇన్‌వాయి్‌స హెచ్‌ఏండీఏకి అందింది. మరో నాలుగు రోజుల్లో రూ.23 కోట్ల చెల్లింపుల కోసం ఎఫ్‌ఈఓ నుంచి మరో ఇన్‌వాయి్‌స అందింది. అప్పటికి ఇంకా పురపాలక శాఖకు ఎఫ్‌ఈఓకు మధ్య ఒప్పందమే జరుగలేదు. ఫోన్‌లోనే ఆదేశాలొచ్చాయి. ఫైల్ కదిలిన తర్వాత కేటీఆర్ నుంచి ఫోన్‌లో వచ్చిన సందేశం ఆధారంగా హెచ్‌ఎండీఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలో అరవిందకుమార్, కేటీఆర్, బిఎల్‌ఎన్ రెడ్డిల ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాట్ లు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. దీంతో వీరి ముగ్గురి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చెప్పారని అర్వింద్ కుమార్ ఆదేశిస్తేనే తాను రెండు ఇన్ వాయి్‌సలకు సంబంధించి నిధుల విడుదలకు అనుమతి ఇచ్చానని హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
పక్కా ఆధారాలతోనే కేటీఆర్ విచారణ
అర్వింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డి విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించనున్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు కేటీఆర్ ఆధారాలతో కాదు అని చెప్పాల్సి ఉంటుంది. అందుకే, ఈడీ అధికారులు అటు ఏసీబీ నుంచి ఇటు పురపాలక శాఖ నుంచి రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారని తెలుస్తోంది.