Share News

TG : తెలంగాణ విద్యా కమిషన్‌

ABN , Publish Date - Sep 04 , 2024 | 04:02 AM

విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ గడువు రెండేళ్ల పాటు ఉంటుంది.

TG : తెలంగాణ విద్యా కమిషన్‌

చైర్మన్‌, ముగ్గురు సభ్యులు.. రెండేళ్ల కాలపరిమితి

ప్రాథమికం నుంచి వర్సిటీ వరకు నాణ్యత పెంపునకు సూచనలు

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. చైర్మన్‌గా ఆకునూరి మురళి?

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ గడువు రెండేళ్ల పాటు ఉంటుంది. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యతను పెంచడానికి అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్‌ తగు సూచనలు, సలహాలను ఇస్తుంది. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులను జారీ చేశారు.

ఈ కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను త్వరలోనే నియమించనున్నారు. నిజానికి ప్రత్యేక చట్టంతో కమిషన్‌ ఏర్పాటు చేసి, చట్టబద్ధత కల్పించాలని తొలుత భావించారు. చివరకు జీవో ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జీవో ద్వారానే ఏర్పాటు చేయనున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్రంలో విద్యారంగం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుత మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల పని విధానం ఉండడం లేదని భావిస్తోంది.

ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగాన్ని తీర్చి దిద్దాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను పెంచడానికి, బోధనా పద్ధతుల్లో మార్పులు, చేర్పులు, విద్యాసంస్థల్లో నాణ్యతను పెంచడానికి ఈ కమిషన్‌ మార్గదర్శ ప్రణాళికను ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.


భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని తీర్చి దిద్దడానికి వీలుగా కమిషన్‌ పని చేయాల్సి ఉంటుంది. పూర్వ ప్రాథమికం నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని స్థాయిల్లో తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. కమిషన్‌ చైర్మన్‌, ముగ్గురు సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఈ మేరకు త్వరలోనే నియామకాలు చేపడతారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిని కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా ఉన్నతాధికారి వ్యవహారించనున్నారు. కమిషన్‌ విద్యారంగ భాగస్వాములందరితో, నిపుణులు, ఇతర ప్రముఖులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి మార్గదర్శ ప్రణాళికను రూపొందించనుంది. విద్యారంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలను ఇవ్వనుంది.

  • కమిషన్‌ ఏర్పాటు ప్రధాన ఉద్దేశాలు

పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ బాల్య దశ విద్యలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వాలి

బడుల్లో నాణ్యమైన విద్యను పెంపొందించడం,

విద్యార్థుల కు సంపూర్ణ విద్యను అందించడం.

ఉద్యోగాలను పొందే విధంగా ఉన్నత విద్యలో నైపుణ్యాలను పెంచడం

ప్రాథమికం నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

ప్రపంచంతో పోటేపడే విధంగా విద్యార్థులను తయారు చేయడం, బాధ్యతాయుత ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దడం.

Updated Date - Sep 04 , 2024 | 04:02 AM