Hyderabad: కోడ్ ముగిసింది..
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:30 AM
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూడు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు.
ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి
త్వరలోనే భారీ ఎత్తున అధికారుల బదిలీలు
పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు
సీఎం చెబితే కానీ ఫైళ్లు కదలని పరిస్థితి
ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ మార్పులు
ప్రజా సంబంధాల విభాగంలోనూ ప్రక్షాళన
వేగంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు
ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్‌రాజ్‌కు?
చంద్రబాబుకు రేవంత్ ఫోన్.. అభినందనలు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూడు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు. సంక్షేమ పథకాలూ ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. గురువారంతో కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి సారించారు. ముందు క్షేత్రస్థాయి ఉద్యోగులు మొదలు ఐఏఎస్‌ల వరకు పెద్ద ఎత్తున బదిలీలు చేయనున్నారు. బదిలీల అనంతరం అధికారులందరికీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలుకు తీసుకోబోయే చర్యలపైౖ దిశా నిర్దేశం చేస్తారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల పంపకం వివాదాలపైనా అధికారులతో చర్చించనున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ పాలన కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అధికారుల బదిలీలు
డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో శాసనసభ ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం లేకపోయింది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్, మంత్రులు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. గురువారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో సీఎం బదిలీలపై దృష్టి సారించారు. ఆర్నెల్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెద్దగా అధికారులు బదిలీలు చేయలేదు. ఈసారి భారీగానే బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు. సీఎంవోలోనూ మార్పులు ఉండవచ్చని సమాచారం. వివిధ ప్రాంతాలు, పలు విభాగాల్లో ఒక్కొక్కరినీ తీసుకొచ్చి సీఎంవోలో ఓఎస్డీలు, సెక్రటరీలుగా నియమించి, పలు శాఖల బాధ్యతలను అప్పగించారు. సీఎం ఆశించినస్థాయిలో వారి పనితీరు లేదని, ముఖ్యమంత్రి చెబితే తప్ప ఫైలు కదలని పరిస్థితి ఉందనే ప్రచారం సచివాలయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
ముఖ్యమంత్రి ప్రజా సంబంధాలను పర్యవేక్షించే విభాగంలోనూ కీలక మార్పులు ఉండే అవకాశం ఉన్నదని సమాచారం. కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం జూన్ చివరివారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, నిధులు పరిశీలించిన తర్వాత జూలై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలనే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు ‘‘ప్రజాపాలన’’లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అర్హులైన వారికి పథకాలు అందించాలని భావిస్తున్నారు. ధరణి పోర్టల్‌లో తలెత్తిన సమస్యలనూ త్వరితగతిన పరిష్కరించాలని సీఎం భావిస్తున్నారు. మూసీ నది సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేలా అధికారులకు సీఎం సూచనలిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన బడ్జెట్ పైనా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఆగష్టు 15 లోగా రూ.2 లక్షల మేర రుణ మాఫీ చేస్తామని హామీనిచ్చిన నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టి సారించారు.
ఉమ్మడి ఆస్తులు, భూములపై నిర్ణయం
పదేళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 నుంచి కేవలం తెలంగాణ రాజధానిగా మారిపోయింది. ఉమ్మడి ఆస్తుల విభజన మాత్రం పూర్తి కాలేదు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో చేర్చిన ఆస్తులు, భూముల పంపకాలపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ పరిధిలోని విలువైన భూములు షెడ్యూల్ 9, 10లో ఉన్నాయి. వీటిపైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి నిధులపరంగా వెసులుబాటు వస్తుంది.
వికా్‌సరాజ్‌కు ఆర్థిక శాఖ?
కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు రాష్ట్ర కేడర్ ఐఏఎ్‌సలలో కనీసం ఇద్దరిని తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ముగ్గురికీ సిన్సియర్ అధికారులుగా పేరు ఉండడమే కాకుండా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి మచ్చ పడకపోవడంతో వారిని ప్రభుత్వంలోకి తీసుకుని, కీలక బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఇప్పట్లో కీలక ఎన్నికలు లేకపోవడంతో ఆ ఐఏఎ్‌సలను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సీఈవో వికా్‌సరాజ్‌ను మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకొని, ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించవచ్చన్న చర్చ జరుగుతోంది. సీఈఓ కార్యాలయంలో 2003 బ్యాచ్‌కు చెందిన డీఎస్ లోకే్‌షకుమార్ అదనపు సీఈఓగా, 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ జాయింట్ సీఈఓగా పని చేస్తున్నారు. వీరిద్దరినీ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. లూప్ లైన్‌లో ఉన్న అధికారుల్లో ఒకరిని సీఈవోగా నియమించే అవకాశం ఉంది.