Share News

Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 10 వేల సీట్ల పెంపు?

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:18 AM

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ సీట్ల సంఖ్య 10 వేల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు సోమవారం ప్రకటించారు.

Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 10 వేల సీట్ల పెంపు?

  • సర్కారు అనుమతించినట్టు సమాచారం

  • ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై రానున్న స్పష్టత

  • మరో 7వేల సీట్ల వరకు కోర్సుల కన్వర్షన్‌

  • వెబ్‌ ఆప్షన్ల నమోదు గడువు రేపటి వరకు పొడిగింపు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ సీట్ల సంఖ్య 10 వేల వరకు పెరగవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు సోమవారం ప్రకటించారు. కానీ ఎన్ని సీట్లు పెరుగుతాయన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడితే కొత్తగా పెరిగే సీట్ల సంఖ్యపై స్పష్టతరానుంది. అయితే కొత్తగా 10 వేల వరకు సీట్లు పెరగవచ్చని సమాచారం. కాగా సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును ఈ నెల 17 వరకు పొడిగించారు.


ఈ ఏడాది రాష్ట్రంలో 98,296 ఇంజనీరింగ్‌ సీట్లకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటిలో ఎక్కువ శాతం కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు సంబంధించినవే . అయితే అదనపు సీట్లకు అనుమతివ్వాలని కాలేజీల యజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. 20వేల సీట్ల వరకు పెంచాలని కాలేజీలు ప్రతిపాదించగా పరిశీలించిన ప్రభుత్వం 10 వేల సీట్ల వరకు పెంచడానికి అనుమతించినట్టు సమాచారం. పెరిగిన సీట్లలో ఎక్కువ శాతం కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు సంబంఽధించినవే ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈసారి కోర్సుల కన్వర్షన్‌ పెద్ద ఎత్తున జరిగింది. పెద్దగా డిమాండ్‌లేని సివిల్‌, మెకానికల్‌ వంటి కోర్సుల్లోని సీట్లను తగ్గించుకుని, డిమాండ్‌ భారీగా ఉన్న కంప్యూటర్‌ ఆధారిత కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి చాలా కాలేజీలు ఆసక్తి చూపాయి.


కోర్సుల కన్వర్షన్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా పరిశీలించి 7వేల సీట్ల వరకు కోర్సుల కన్వర్షన్‌కు అనుమతించింది. ఈ మేరకు కంప్యూటర్‌ కోర్సుల్లోని సీట్ల సంఖ్య పెరగనుంది. ఇంజనీరింగ్‌ సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అభ్యర్థులు నమోదు చేసుకునే వెబ్‌ ఆప్షన్ల గడువును సోమవారం పొడిగించారు. సోమవారంతో ముగిసిన వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు ను 17 వరకు పొడిగించారు. దీంతో అభ్యర్థులు తాము కోరుకునే కాలేజీల్లో కోరుకున్న సీట్ల కోసం వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. సోమవారం వరకు రాష్ట్రంలో 93,167 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 04:18 AM