Share News

Etela Rajender: భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే ..

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:14 AM

‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. డబ్బు పంపిణీ చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదు. 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించినప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనేదానికి సంకేతం.

Etela Rajender: భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వమే ..

  • లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే సంకేతం

  • ఇక్కడ కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే

  • మా ఓటు బ్యాంకు 35శాతానికి పెరిగింది

  • రాష్ట్ర అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం

  • రేవంత్‌ ఆరు నెలల్లోనే చీకొట్టించుకున్నారు: ఈటల

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. డబ్బు పంపిణీ చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరగలేదు. 8 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించినప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనేదానికి సంకేతం. ఇక్కడ కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీనే’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యావత్‌ ప్రజానీకం మూడోసారి మోదీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుందని తెలిపారు. రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు తమకు 8 స్థానాలు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 14శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు లోక్‌సభ ఎన్నికల నాటికి 35 శాతానికి పెరిగిందని చెప్పారు. ఆరు నెలల్లోనే సీఎం రేవంత్‌ ప్రజలతో చీకొట్టించుకున్నారని విమర్శించారు.


మల్కాజిగిరి తన సొంత లోక్‌సభ నియోజకవర్గం అని, మహబూబ్‌నగర్‌ సొంత జిల్లా అని విర్రవీగినా ప్రజలు రేవంత్‌ను నమ్మలేదన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తన శక్తినంతా వాడినా భంగపాటు తప్పలేదని పేర్కొన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపడుతుందని వెకిలి మాటలు మాట్లాడటం తగదన్నారు. ఏ స్థానం కూడా పార్టీలకు, వ్యక్తులకు జాగీరు కాదని, బీజేపీ తరఫున గెలిచిన వారంతా అనుభం ఉన్నవారేనని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్‌ తప్ప మిగతా స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరారని.. ఎవరి డిమాండ్లు వారికి ఉన్నాయని పేర్కొన్నారు. సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ప్రజలే ఎన్నికల సమయంలో బండకేసి కొడతారని, ఇందుకు పక్క రాష్ట్రంలో వచ్చిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు.


అడిగితే మంత్రి పదవి ఇస్తారా..?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మంత్రి పదవి అడుగుతారా అని ఈటలను విలేకరులు ప్రశ్నించగా.. అడిగితే మంత్రి పదవి ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి ప్రశ్నలు తనను అడగొద్దని చెప్పారు. పదవులు ఇవ్వడానికి ఒక లెక్క, పత్రం ఉంటుందని, ప్రయత్నిస్తే పదువులు రావని ఆయన అన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 04:14 AM