Share News

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:36 AM

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు.

Farmers Protest: రోడ్డెక్కి.. పురుగు మందు చేతపట్టి!

  • రుణమాఫీ కాలేదంటూ పలు జిల్లాల్లో రైతుల ఆందోళనలు

  • పలుచోట్ల బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు

  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..

  • షరతుల్లేకుండా రుణమాఫీకి డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ తమకు అందలేదని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి.. పురుగు మందు చేతపట్టి నిరసనలు చేపట్టారు. బ్యాంకులు, వ్యవసాయశాఖ, సహకార సంఘాల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి అధికారులను నిలదీశారు. పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి.. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎటువంటి షరతుల్లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. పలుచోట్ల బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో ధర్నాలు చేశారు.


శనివారం ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో రైతుల ఆందోళనలు కొనసాగాయి. నిజామాబాద్‌ జిల్లాలో వేల్పూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద బాల్కొండ నియోజకవర్గం రైతులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు, కటింగ్‌ లేకుండా బేషరతుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ జిల్లాలోని ఆలూర్‌ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు ఎదుట రైతులు బైఠాయించి ధర్నా నిర్వహించారు. బ్యాంకులో సుమారు 2,500 మంది రైతులకు ఖాతాలుండగా, అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం 500 మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మండిపడ్డారు.


కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం జంగంపల్లిలో రుణమాఫీ కాలేదని ఆవేదనతో రాజంపేట మండలం ఆరేపల్లి తండాకు చెందిన కేతావత్‌ రవి సెల్‌టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు, తాంసి, జైనథ్‌, బోథ్‌ మండలాల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. తలమడుగు మండలంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో రైతులు ఊరంతా ఊరేగింపు నిర్వహించారు. బోథ్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. జైనథ్‌ మండలం గిమ్మా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రను ముట్టడించిన రైతులు గిమ్మా ఎక్స్‌ రోడ్డు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు సర్దిచెప్పడంతో రైతులు ఆందోళనను విరమింపజేశారు.


నిర్మల్‌ జిల్లాలోని మామడ మండలంలోని పొన్కల్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జోనల్‌ మేనేజర్‌ అభిషేక్‌, సిబ్బందిని రైతులు నిలదీశారు. అన్ని బ్యాంకుల్లో రుణమాఫీ జరుగుతుంటే.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూరులో కరీంనగర్‌-వరంగల్‌ రహదారిపై రైతులు ధర్నా చేశారు. గంగాధర మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో రైతు ఏలేటి రాజారెడ్డి పురుగు మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశాడు. మెట్‌పల్లి మండలంలోని వేంపేటలో కెనరా బ్యాంకు ఎదుట రైతులు బైఠాయించారు.


జన్నారం మండలం కవ్వాల గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట రైతు జక్కుల లచ్చన్న పురుగు మందు తాగేందుకు యత్నించగా తోటి రైతులు అడ్డుకున్నారు. రైతు రుణమాఫీ వివరాలు బహిర్గతం చేయాలంటూ సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో వ్యవసాయశాఖ కార్యాలయానికి రైతులు వెళ్లగా.. అక్కడి అధికారులు వివరాలు తెలుపకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూరు మండలంలో రాజీవ్‌ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ‘అయ్యా రేవంత్‌రెడ్డి.. రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి, రేషన్‌కార్డులున్నవారికే చేశావు. రైతుబంధు వేయలేదు. రుణమాఫీ చేస్తావా.. పురుగుల మందు తాగి చనిపోవాలా?’ అంటూ పురుగుమందు డబ్బాతో సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువరైతు సెల్ఫీ వీడియో విడుదల చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Aug 18 , 2024 | 03:36 AM