జాతీయ రహదారిపై వాహనాల వరద
ABN , Publish Date - Oct 14 , 2024 | 04:39 AM
దసరా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శనివారం ఊరూరా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శమీ పూజలతోపాటు బొడ్రాయి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిచెట్టును దర్శించుకున్నారు.
టోల్ ప్లాజాల వద్ద భారీగా బారులు.. పంతంగి, కేతేపల్లి వద్ద కిక్కిరిసిన వాహనాలు
హైదరాబాద్‌కు జనం తిరుగుపయనం
దసరా పండుగ ముగియడంతో నగరానికి
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దసరా పండుగ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
దసరా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శనివారం ఊరూరా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శమీ పూజలతోపాటు బొడ్రాయి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిచెట్టును దర్శించుకున్నారు. జమ్మి ఆకును సేకరించి ఒకరికొకరు పంచుకొని అలయ్ బలయ్ తీసుకున్నారు. పాలపిట్టను తిలకించి పరవశించిపోయారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ వధ కార్యక్రమం నిర్వహించారు. కాగా, దసరా పండుగ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి ఏపీ రాష్ట్రంతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తిరిగి పయనమైన వాహనాలతో ఆదివారం రహదారులు కిక్కిరిసిపోయాయి.
వివిధ టోల్ ప్లాజాల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. పలుటోట్ల అదనపు కౌంటర్ల ద్వారా పంపించినా.. వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఉదయం నుంచే వాహనాల రాకపోకలు పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో, నల్లగొండ జిల్లా కేతేపల్లి టోల్‌గేట్ వద్ద వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పంతంగి టోల్‌గేటు వద్ద 16 గేట్లకుగాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపించారు. సాధారణ రోజుల్లో 30 నుంచి 35వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండంగా దసరా పండుగ నేపథ్యంలో 50వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్లు టోల్‌గేట్ నిర్వాహకులు తెలిపారు.
గూడూరు వద్ద కిలోమీటరుపైగా..
బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద కిలోమీటరు పైగా వాహనాలు బారులు తీరాయి. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ శివారులో ఉన్న టోల్‌ప్లాజా వద్ద వాహనాల సంఖ్యకు అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు అర కిలోమీటర్ మేర నాలుగు లేన్లతో బారులు తీరాయి. ఆదివారం 35 వేల నుంచి 40 వేల వాహనాలు రాకపోకలు సాగించాయని సిబ్బంది తెలిపారు.
నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామం వద్ద రాజీవ్ రాహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద ఆదివారం కిలోమేటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి.
ఖాళీగా హైదరాబాద్ రోడ్లు..
హైదరాబాద్ నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీతో నరకప్రాయంగా ఉండే రోడ్లన్నీ గత రెండు రోజలుగా వెలవెలబోయాయి. పట్నం, పల్లెకు వెళ్లడంతో హ్యాంగవుట్ స్పాట్స్ సహా అన్నీ కళతప్పాయి. శనివారమంతా పండుగ సంబరంతో అలిసిన నగర జనం, ఆదివారం ఆ అలసట తీర్చుకోవడానికి ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. వరుస సెలవులతో ఏపీ, తెలంగాణకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివెళ్లడంతో వారాంతంలో కూడా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆక్యుపెన్సీ కూడా తగ్గింది. ఈ మధ్యకాలంలో నగరంలో ఇంత తక్కువ ట్రాఫిక్ రద్దీని తాము చూడలేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే, తెలంగాణ జిల్లాల నుంచి సాయంత్రం బయలు దేరిన నగరవాసులు అర్ధరాత్రి తరువాత ఇంటికి చేరుకోవడం కనిపించింది.