Shailendra Kumar Joshi: మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్, హరీశ్‌రావులదే!
ABN , Publish Date - Dec 19 , 2024 | 04:48 AM
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ .. దాంట్లో భాగంగానే ప్రాణహిత-చేవెళ్ల మార్పు
సీఎం కన్నా మంత్రివర్గమే శక్తిమంతమైనది
కానీ, సీఎం మాట కాదన్న మంత్రికి ఉద్వాసనే!
కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు మాజీ సీఎస్ ఎస్‌కే జోషి జవాబులు
పునాదిలో ఇసుక జారి మేడిగడ్డ కుంగిందన్న మాజీ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. దాంట్లో భాగంగానే మేడిగడ్డపైనా నిర్ణయం తీసుకుందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట బుఽధవారం జోషి హాజరయ్యారు. ఆయనపై కమిషన్ పలు ప్రశ్నలు సంధించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి కారణం?
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేశారు. అప్పటికి బ్యారేజీ తప్ప ఇతర కాంపోనెంట్ల పరంగా 7.7 ు పనులు జరిగాయి. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో మేడిగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలవనరుల సంఘం కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, ఆఫ్‌లైన్, అన్‌లైన్ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరగాలని చెప్పింది.
బ్యారేజీలు అక్కడే కట్టాలనే నిర్ణయాలు ఎవరివి?
అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యాప్కోస్ కమిటీ, సీఈ, సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సబ్‌కమిటీ వేయలేదు. 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేసీఆర్ భూమి పూజ చేసి, మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారు. అదే రోజు ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చారు.
బ్యారేజీల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా? ప్రభుత్వం అంటే ఏమిటి?
అప్పటి మంత్రివర్గం, సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ జడ్జి కన్నా బెంచ్ బలమైనదన్నట్లుగా.. సీఎం కన్నా మంత్రివర్గమే బలమైనది. అయితే సీఎంను ఎవరైనా మంత్రి వ్యతిరేకించినా, అసమ్మతి తెలిపినా ఆ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉంటుంది.
స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎ్‌ససీ) లక్ష్యాలు, విధులు, బాధ్యతలు ఏమిటి? కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలన పరమైన అనుమతులన్నీ ఉన్నాయా?
వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్లతో ఎస్‌ఎల్‌ఎ్‌ససీ ఉంటుంది. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాల ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ కమిటీ చర్చించి, లోపాలుంటే వాటిని సవరించాలని సూచిస్తుంది. అన్నీ సరిగా ఉంటే ఆ ప్రతిపాదనలకు పరిపాలనపరమైన అనుమతి ఇవ్వవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలు, 8 లింకులుగా ఉంది. గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేశాం. చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎల్‌ఎ్‌ససీకి ప్రతిపాదనలు పంపిస్తే... ఆ తర్వాత ప్రభుత్వానికి చేరిన తర్వాత దాదాపు 200లకు పైగా పనులకు విడివిడిగా పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చాం.
మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కొన్ని బ్లాకులను వేరే సంస్థతో కట్టించిందా?
ఆ సమాచారం తెలియదు.
ఇసుక జారిపోయి మేడిగడ్డ కుంగింది
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు పునాదుల కింద ఇసుక జారటం వల్లే బ్యారేజీ కుంగిందని నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ కాళేశ్వరం కమిషన్‌కు తెలియజేశారు. మేడిగడ్డ వైఫల్యానికి కారణాలేంటో చెప్పగలరా? అని కమిషన్ ప్రశ్నించగా.. కచ్చితమైన కారణాలు తెలియదని, రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా బ్యారేజీ కుంగిందని, దీంతో మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఉండటంతో బ్యారేజీ వద్దకు వెళ్లలేదన్నారు. బ్యారేజీలు నీటి నిల్వ కోసమా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. నీటి నిల్వ కోసం కాదని, నీటి మళ్లింపు కోసమే కట్టాలన్నారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారన్న ప్రశ్నకు.. ప్రాజెక్టు అథారిటీ (సంబంధిత చీఫ్ ఇంజనీర్) ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నిర్మాణ ఒప్పందానికి విరుద్ధంగా.. వేర్వేరు తేదీలతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారా అని అడగగా.. తనకు తెలియదని పేర్కొన్నారు.
నేడు సోమేశ్‌కుమార్, స్మితా సబర్వాల్ విచారణ
కాళేశ్వరంపై విచారణలో భాగంగా గురువారం సీఎంవో మాజీ కార్యదర్శి, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు.