Share News

Akunoori Murali: విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి?

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:14 AM

విద్యా కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుసోంది. పాఠశాల విద్యపై గతంలో పని చేసిన అనుభవం ఉండటం, గతంలో ఐఏఎస్‌ అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Akunoori Murali: విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి?

  • మాజీ ఐఏఎస్‌ పేరును పరిశీలిస్తున్న ప్రభుత్వం

హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): విద్యా కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుసోంది. పాఠశాల విద్యపై గతంలో పని చేసిన అనుభవం ఉండటం, గతంలో ఐఏఎస్‌ అధికారిగా ప్రభుత్వ యంత్రాంగంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శాశ్వత సభ్యుడు, రాహుల్‌గాంధీకి సన్నిహితుడైన కొప్పుల రాజుతో ఆకునూరి మురళికి మంచి సంబంధాలు ఉండడమూ ఆయనకు కలిసి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విద్యా కమిషన్‌ ఏర్పాటు ప్రాథమిక దశలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ ఏర్పాటుకు అసెంబ్లీ, గవర్నర్‌ ఆమోదం తీసుకోవాల్సి ఉందని, ఇవి పూర్తయి ఏర్పాటు చేయడానికి ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు.


ఈ కమిషన్‌ చైర్మన్‌కు క్యాబినెట్‌ హోదా కూడా ఉండటంతో మున్ముందు ఈ పోస్టుకు పోటీ పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. కాగా ఉన్నత విద్యామండలి, రైతు కమిషన్‌ సహా మరికొన్ని కమిషన్లు, కార్పొరేషన్ల నియామకాలూ పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కార్పొరేషన్లు, కమిషన్లలో ఇటీవలే 36 మంది నియామకం పూర్తయిన సంగతి తెలిసిందే. మిగిలిన నామినేటెడ్‌ నియామకాలపైనా కసరత్తు జరుగుతోంది. ఈ నియామకాలపైనా త్వరలోనే అధిష్ఠానంతో సీఎం రేవంత్‌ రెడ్డి చర్చించి అనుమతులు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jul 21 , 2024 | 04:14 AM