Jayadev: సీబీఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా
ABN , Publish Date - Jul 09 , 2024 | 04:02 AM
సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకరా వేసి రూ.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఆర్ జయదేవ నాయుడు (85) తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.
వివిధ ఖాతాల నుంచి రూ.50 లక్షలు లూటీ
మనీలాండరింగ్ కేసు విచారణ అంటూ బెదిరింపు
తనిఖీ చేశాక తిరిగిస్తాం.. లేదంటే అరెస్టని హెచ్చరిక
బాధితుడు ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ నాయుడు.. మోసంపై పోలీసులకు ఫిర్యాదు
పాకాల, జూలై 8: సీబీఐ అధికారుల పేరుతో మాజీ ఎమ్మెల్యేకే టోకరా వేసి రూ.50 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీలోని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఆర్ జయదేవ నాయుడు (85) తిరుపతి జిల్లా పాకాల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. జయదేవ నాయుడికి గత శనివారం ఓ మహిళ వీడియో కాల్ చేసి... మీ అకౌంటు నుంచి కొన్ని కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పింది. తాము అరెస్టు చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తే మీ నంబరు కూడా అందులో ఉందని.. కాబట్టి మిమ్మల్ని కూడా అరెస్టు చేసే అవకాశముందని బెదిరించింది.
మనీలాండరింగ్‌తో తనకెలాంటి సంబంధాల్లేవని జయదేవ్ చెప్పగా... తనపై ఆఫీసరుతో మాట్లాడుకోవాలని మరో వ్యక్తికి ఫోన్ కనెక్ట్ చేసింది. వెంటనే లైన్లోకి వచ్చిన మరో వ్యక్తి.. తాము ఫోన్ చేసిన విషయం ఎవరికైనా చెబితే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించారు. సీబీఐ అకౌంటు నంబరు పంపిస్తామని, ఆ అకౌంటుకు మీ ఖాతాల్లోని డబ్బు పంపిస్తే తనిఖీ చేసుకున్నాక మూడో రోజు తిరిగి మీ ఖాతాలకు వేసేస్తామని చెప్పారు. దీంతో జయదేవ నాయుడు శనివారమే బ్యాంకుకు వెళ్లి ఆరు అకౌంట్ల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.50 లక్షలు వారు చెప్పిన అకౌంటు నంబరుకు పంపించారు.
అమెరికాలో ఉండే కుమారుడు ఆదివారం ఫోన్ చేస్తే జరిగిందంతా వివరించారు. మోసపోయినట్టు గ్రహించిన కుమారుడు.. వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారం తిరుపతి ఎస్పీ హర్షవర్దన రాజును కలసిన జయదేవ నాయుడు జరిగిన విషయం వివరించారు. ఆయన సూచన మేరకు జయదేవ నాయుడు సోమవారం సాయంత్రం పాకాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.