Share News

Hyderabad: విజయవాడ హైవే నుంచి జీఎంఆర్‌ ఔట్‌..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:39 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65) నిర్వహణ బాధ్యతల నుంచి జీఎంఆర్‌ సంస్థ తప్పుకొంది. ఈ మేరకు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ల బాధ్యతలను వదులుకుంది.

Hyderabad: విజయవాడ హైవే నుంచి జీఎంఆర్‌ ఔట్‌..

  • నెలకు రూ.6కోట్ల మేర నష్టమే కారణం

  • ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో మూడు టోల్‌గేట్లు

  • తాత్కాలిక ఏజెన్సీలకు బాధ్యతల అప్పగింత

చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 30: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65) నిర్వహణ బాధ్యతల నుంచి జీఎంఆర్‌ సంస్థ తప్పుకొంది. ఈ మేరకు యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ల బాధ్యతలను వదులుకుంది. దీంతో.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ టోల్‌గేట్లను స్వాధీనం చేసుకుంది. టోల్‌ వసూలు బాధ్యతలను తాత్కాలికంగా మూడు ఏజెన్సీలకు అప్పగించింది. పంతంగి టోల్‌గేట్‌ బాధ్యతలను స్కైల్యాబ్‌, ఇన్‌ఫ్రా గ్రూపులకు.. చిల్లకల్లు టోల్‌గేట్‌ బాధ్యతలను కోరల్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించింది.


కాగా, అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో ఒకటైన విజయవాడ హైవే విస్తరణకు గతంలో ఉద్యమాలు జరిగాయి. దీంతో.. 2010లో అప్పటి యూపీఏ సర్కారు బిల్డ్‌-ఆపరేట్‌-ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) విధానంలో టెండర్లను ఆహ్వానించగా.. జీఎంఆర్‌ రూ.1,740కోట్లతో పనులను దక్కించుకుంది. యదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వరకు 181కి.మీ రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసింది. 2012 నుంచి పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు వద్ద టోల్‌గేట్లు ఏర్పాటయ్యాయి. 12 ఏళ్లుగా ఈ రహదారి బాధ్యతలను నిర్వర్తించిన జీఎంఆర్‌.. ఇప్పుడు తప్పుకోవడంతో.. తిరిగి ఎన్‌హెచ్‌ఏఐ తన అధీనంలోకి తీసుకుంది.


నష్టాలే కారణం..

పంతంగి టోల్‌ మీదుగా రోజుకు 35 వేల దాకా.. వారాంతాలు, సెలవు రోజుల్లో అంత కన్నా ఎక్కువ వాహనాలు వస్తుంటాయి. అయినా.. తమకు ఈ రహదారి నిర్వహణతో నష్టం వాటిల్లుతోందని జీఎంఆర్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2025 జూన్‌ నెలాఖరు వరకు జీఎంఆర్‌ సంస్థకు టోల్‌ వసూలు హక్కులున్నా.. ఏడాది ముందుగానే తప్పుకొంటున్నట్లు తెలిపారు. నెలకు రూ.6కోట్లమేర.. అంటే రోజుకు రూ.20లక్షల చొప్పున నష్టం వస్తుండడంతోనే ఈ టోల్‌గేట్లను వదులుకున్నట్లు వివరించారు. ముందుగానే తప్పుకొంటున్నందుకు నష్టపరిహారం చెల్లించేందుకు జీఎంఆర్‌ సిద్ధపడడం గమనార్హం..! 2025లోగా ఈ రహదారిని ఆరు లేన్లకు అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. దీనిపై జీఎంఆర్‌ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది.

Updated Date - Jul 01 , 2024 | 04:39 AM