Share News

Hyderabad: దీపావళికి 2 డీఏలు!

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:08 AM

ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad: దీపావళికి 2 డీఏలు!

  • ఉద్యోగులకు ఇచ్చే యోచనలో సర్కారు

  • ఇప్పటికే పెండింగ్‌లో 4.. ఈ ఏడాది జూలైతో జత కలిసిన ఐదో డీఏ

  • కనీసం 3 ఇవ్వాలంటున్న ఉద్యోగులు.. ఒక్కో డీఏ చెల్లింపునకు ఏటా 1200 కోట్లు

  • ఎరియర్స్‌తో కలిపి 4 డీఏలు ఇస్తే ప్రభుత్వంపై ఏటా రూ.7900 కోట్ల భారం

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని దీపావళి నాటికి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది జూలై 1న ఐదో డీఏ కూడా జత కలవడంతో.. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇందుకోసం సంఘాల ప్రతినిధులు నిత్యం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ పది నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా.. సర్కారు సానుకూలంగా స్పందించడంలేదంటూ వారు అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల డిమాండ్లపై ఆచితూచి వ్యవహరిస్తోంది.


ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఆర్థికపరమైన వాటిని అంశాల వారీగా పరిష్కరిస్తామని మంత్రులు చెబుతున్నారు. అయినా.. ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. బుధవారం కూడా ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్‌ మారెం జగదీశ్వర్‌, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో సీఎంవోకు వెళ్లారు. సీఎం ముఖ్యకార్యదర్శిని కలిసి తమ డిమాండ్లపై చర్చించారు. కాగా, ఉద్యోగులకు ఒక డీఏ చెల్లింపునకు నెలకు రూ.100 కోట్లకు పైగా అవుతుందని, ఈ లెక్కన ఏడాదికి రూ.1200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే నాలుగు డీఏలు అమలు చేస్తే.. ఏరియర్స్‌తో కలిపి రూ.7900 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ చెబుతున్నారు.


  • మూడు డీఏలైనా ఇవ్వాలి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు చెబుతున్న వివరాల నేపథ్యంలో.. ప్రస్తుతానికి ప్రభుత్వం నాలుగు డీఏలు చెల్లించకపోవచ్చనే భావన ఉద్యోగుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో కనీసం మూడు డీఏలైనా విడుదల చేయాలని కోరుతున్నారు. తాము చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో దీపావళికి రెండు డీఏలను విడుదల చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోందని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. కానీ, తాము మాత్రం మూడు డీఏలైనా ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు. డీఏల పెండింగ్‌ వల్ల ఒక సాధారణ ఉద్యోగి నెలకు రూ.10 వేల వరకు నష్టపోతున్నారని, రూ.70 వేల పైన వేతనం తీసుకునే ఉద్యోగి అయితే నెలకు రూ.15 వేల వరకు నష్టపోతున్నారని వివరించారు. పీఆర్‌సీ జాప్యం వల్ల మరో రూ.15 వేలు నష్టపోతున్నారని, ఇవన్నీ అమలు చేస్తే ప్రతి ఉద్యోగికీ నెలకు రూ.30 వేల అదనపు వేతనం అందుతుందని తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 03:08 AM