Transfer: పూర్వ జిల్లాలకు తహసీల్దార్ల బదిలీలు!
ABN , Publish Date - Oct 11 , 2024 | 03:35 AM
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను ఎన్నికల ముందు పనిచేసిన జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3 రోజుల్లో వివరాలు ఇవ్వాలని సీసీఎల్‌ఏ ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను ఎన్నికల ముందు పనిచేసిన జిల్లాలకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ల వివరాలను మూడు రోజుల్లోగా అందించాలని కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) నవీన్‌మిట్టల్ గురువారం లేఖ రాశారు. ఆ వివరాలు అందిన వెంటనే వారిని పూర్వ జిల్లాలకు పంపించనున్నారు.
ఇటీవలే తహసీల్దార్లతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కాగా... ఆ సమావేశంలో తమను ఎన్నికలకు ముందు పనిచేసిన జిల్లాలకు పంపించాలని అధికారులు నివేదించుకున్నారు. కాగా, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్(టీజీటీఏ) విజ్ఙప్తి మేరకే సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ అయ్యాయని, మంత్రితో పాటు సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌కు ఆ సంఘం అధ్యక్షుడు ఎస్.రాములు, మహిళా అధ్యక్షురాలు పి.రాధ తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే బదిలీ ప్రక్రియలో జాప్యం జరిగిందని, ఎలాంటి షరతులు లేకుండా ఈ ప్రక్రియ చేపట్టాలని కోరారు.