Share News

Hyderabad: లోడెత్తలేదు.. సీఎంఆర్‌ ఇవ్వలేదు!

ABN , Publish Date - Sep 27 , 2024 | 02:49 AM

టెండర్‌ అగ్రిమెంటు చేసుకొని తొమ్మిది నెలలు గడిచినా.. ఇంతవరకూ పౌరసరఫరాల సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. రైస్‌మిల్లుల నుంచి ధాన్యం లోడెత్తలేదు.

Hyderabad: లోడెత్తలేదు.. సీఎంఆర్‌ ఇవ్వలేదు!

టెండర్లలో పాడిన 25 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రైస్‌మిల్లుల్లోనే

  • పౌరసరఫరాల సంస్థకు డబ్బు చెల్లించలేదు... ధాన్యం తీసుకెళ్లలేదు

  • 35 లక్షల టన్నుల టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

  • ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్‌ లక్ష్యాన్ని పూర్తిచేయని మిల్లర్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టెండర్‌ అగ్రిమెంటు చేసుకొని తొమ్మిది నెలలు గడిచినా.. ఇంతవరకూ పౌరసరఫరాల సంస్థకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. రైస్‌మిల్లుల నుంచి ధాన్యం లోడెత్తలేదు. వేలంపాటలో దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలు.. ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా రెండేళ్ల కిందటి రబీ ధాన్యం 25 లక్షల మెట్రిక్‌ టన్నులు.. ఇంకా రైస్‌మిల్లుల్లోనే మూలుగుతోంది. మరోవైపు రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థకు ఇవ్వాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ లక్ష్యాన్ని పూర్తిచేయకుండా మొండికేస్తున్నారు. నాలుగురోజుల్లో అక్టోబరు నెల వస్తోంది. అక్టోబరులో 91 లక్షల టన్ను ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కానీ.. పాత నిల్వలు లక్షల టన్నులు ఉండగా... కొత్త ధాన్యం నిల్వచేయటానికి చోటెక్కడ? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.


కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించిన ధాన్యాన్ని రాష్ట్ర పౌరసరసరఫరాల సంస్థ ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు పం పిస్తుంది. మిల్లింగ్‌ చార్జీలు, నూకలు, పరం, తవుడు, ఊక తదితర ఉప ఉత్పత్తులు తీసుకొని... ఆరు నెలల్లోపు 67- 68 శాతం రికవరీ రేటుతో రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలి. కానీ ఈ ప్రక్రియ సజావుగా సాగటంలేదు. రైస్‌మిల్లర్లు కొందరు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని నేరుగా అమ్ముకుంటున్నారు. కొందరేమో ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరేమో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం అమ్ముకొని... పీడీఎస్‌ బియ్యాన్ని తిరిగి ఎఫ్‌సీఐకి, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు అంటగడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం నిల్వలను కొంత మేరకు ఖాళీ చేసేందుకు గత కేసీఆర్‌ ప్రభుత్వం 35 లక్షల మెట్రిక్‌ టన్నులకు టెండర్లు పిలిచింది. 2022- 23 యాసంగి సీజన్‌ ధాన్యానికి ఎన్నికల ముందు టెండర్లు పిలవగా.. సగటున క్వింటాలుకు రూ.1,700 చొప్పున రేటు వచ్చింది.


టెండర్లలో అక్రమాలు జరిగాయని, పౌరసరఫరాల సంస్థకు భారీ నష్టం అని ఆరోపణలు రావటంతో టెండర్లు రద్దుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ టెండర్లు పిలిచారు. ఇప్పుడు క్వింటాలుకు సగటున రూ.2 వేల రేటు వచ్చింది. కానీ అప్పుడు ఏ ఏజెన్సీలకు టెండర్లు దక్కాయో? ఇప్పుడు కూడా అవే ఏజెన్సీలకు టెండర్లు దక్కటం చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ ఏజెన్సీలు నిర్ణీత గడువులో రైస్‌మిల్లుల నుంచి ధాన్యం లిఫ్టింగ్‌ చేయటంలేదు. ధాన్యం విక్రయిస్తే.. రూ.7 వేల కోట్ల తక్షణ ఆదాయం వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కానీ ఇప్పటివరకు రూ.2 వేల కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇంకా రూ.5 వేల కోట్లు రికవరీ కావాల్సి ఉంది. టెండర్‌ అగ్రిమెంటుచేసి 9 నెలలు గడిచినా... కేవలం 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే లిఫ్టింగ్‌ చేశారు. ఈలావాదేవీలు కూడా కాగితాలపైనే జరిగాయి. రైస్‌ మిల్లు నుంచి లారీ లోడు ఎత్తింది లేదు. ధాన్యం బయటకు పంపించింది లేదు.


  • ఎఫ్‌సీఐకి టన్నుల కొద్దీ బకాయిలు

2022- 23 యాసంగి సీజన్‌లో 35 లక్షలు టెండర్లు పెట్టింది పోగా... ఇంకో 16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకి రైస్‌ ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. కానీ రైస్‌మిల్లర్లు ఇప్పటికీ ఆ టార్గెట్‌ కూడా పూర్తిచేయలేదు. 2018- 23 మధ్యకాలంలో కూడా ఏ ఏడాదీ 100ు సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తికాలేదు. ఆ నిల్వలు కూడా మిల్లుల్లో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ తర్వాత మళ్లీ రెండు సీజన్లలో(2023- 24)లో ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్మెంట్‌ చేసింది. ఖరీ్‌ఫలో 47.34 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలుచేసి రైస్‌మిల్లర్లకు అప్పగించింది. 32 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సీఎంఆర్‌ రూపంలో ఇవ్వాల్సి ఉండగా... 21 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి చేరింది. మిగిలిన ధాన్యం రైస్‌మిల్లుల్లోనే ఉంది. నిరుడు రబీ సీజన్‌లో 48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్‌ చేసి మిల్లర్లకు అప్పగించింది. 33 లక్షల టన్నుల బియ్యం సీఎంఆర్‌ రూపంలో తిరిగి రావాల్సి ఉండగా... ఇప్పటివరకు 12 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే రికవరీ అయ్యింది. ఇంకా 21 లక్షల టన్నుల సీఎంఆర్‌ రిక వరీ కాలేదు. ఇందుకు సంబంధించిన ధాన్యం కూడా రైస్‌మిల్లుల్లో నిల్వ ఉండటం గమనార్హం.

Updated Date - Sep 27 , 2024 | 02:49 AM