Share News

School Maintenance Grant: బడి శుభ్రంగా.. ఆవరణ పచ్చగా

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:04 AM

పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును విడుదల చేసింది. ఈ గ్రాంటు కింద వచ్చే మొత్తంతో పాఠశాలల నిర్వహణలో భాగంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు, మోడల్‌ స్కూళ్లలో గదులు, మురుగుదొడ్ల శుభ్రత, ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులను నిర్వహిస్తారు.

School Maintenance Grant: బడి శుభ్రంగా.. ఆవరణ పచ్చగా

  • పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక గ్రాంటు విడుదల

  • విద్యార్థులను బట్టి నెలకు రూ.3వేల నుంచి 20వేలు

  • సమగ్ర శిక్ష కంపోజిట్‌ గ్రాంట్‌కు అదనంగా ఈ మొత్తం

  • అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా నిర్వహణ

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును విడుదల చేసింది. ఈ గ్రాంటు కింద వచ్చే మొత్తంతో పాఠశాలల నిర్వహణలో భాగంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు, మోడల్‌ స్కూళ్లలో గదులు, మురుగుదొడ్ల శుభ్రత, ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులను నిర్వహిస్తారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ)ల ద్వారా ఈ నిధులను వినియోగిస్తారు. ప్రస్తుతం ఈ పనులను పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ విభాగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఈ శాఖల ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహణ పనులు సవ్యంగా జరగడం లేదనే ఆందోళన చాలాకాలం నుంచి ఉంది. పాఠశాలలకే ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాఠశాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైన అంశమని భావించిన ప్రభుత్వం ఈ బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించింది. కాగా ఇప్పటికే ఇస్తున్న ‘సమగ్ర శిక్ష కంపోజిట్‌ స్కూల్‌ గ్రాంటు’కు అదనంగా ఈ గ్రాంటును చెల్లించనున్నారు. విద్యా సంవత్సరంలోని 10 నెలల పాటు ఈ నిధులను చెల్లించనున్నారు. నిధుల వినియోగంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతా నుంచి మొత్తాన్ని డ్రా చేస్తున్నప్పుడు, ఎక్కడా ఏ వ్యక్తి పేరును పేర్కోనవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


ఈ పనుల కోసం ఉద్దేశించిన వ్యక్తులకు ఈ నిధులను నేరుగా ఇవ్వడానికి వీలుగా వెసులుబాటును కల్పించారు. ఈ పనుల కోసం పూర్తి సమయం లేదా పార్ట్‌ టైమ్‌ పద్ధతిలో కార్మికులను నియమించుకోవచ్చు. ఈ గ్రాంటును జిల్లా మినరల్‌ ఫండ్‌ ట్రస్ట్‌ (డీఎంఎ్‌ఫటీ) నుంచి విడుదల చేయనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు మూడు నెలల ముందుగానే ఈ నిధులను విడుదల చేస్తారు. కాగా, ఈ గ్రాంటను ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి నెలకు రూ.3వేల నుంచి రూ.20వేల దాకా ఇస్తారు.


  • ముగిసిన డీఎస్సీ పరీక్షలు

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయల పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలు ముగిశాయి. రాష్ట్రంలో 11062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో భాగంగా గత నెల 18వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. కాగా ఈ పోస్టుల కోసం మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తులను చేసుకున్నారు. ఇందులో 2,45,263 మంది (87.61ు) అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.


  • అక్టోబరు 31 వరకు స్కాలర్‌ షిప్‌ దరఖాస్తులు

నేషనల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ కోసం అక్టోబరు 31వ తేదీ వరక దరఖాస్తులను సమర్పించుకోవచ్చని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షి్‌పల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ప్రభుత్వం మంజూరు చేసిన స్కూల్‌ గ్రాంట్‌ వివరాలు (రూ.ల్లో)

విద్యార్థులు గ్రాంటు

1 నుంచి 30 3,000

31 నుంచి 100 6,000

101 నుంచి 250 8,000

251 నుంచి 500 12,000

501 నుంచి 750 15,000

750కి పైబడి 20,000

Updated Date - Aug 06 , 2024 | 04:04 AM