Share News

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో 235 వైద్య పోస్టుల భర్తీ

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:49 AM

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో 235 వైద్య పోస్టుల భర్తీ

  • కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం

  • రేపు వాకిన్‌ ఇంటర్వ్యూల నిర్వహణ

హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్నా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 235 మంది వైద్యుల పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌ పోస్టులు-8, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ -23, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-111, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు-33 ఉన్నాయి. గాంధీలో ప్రొఫెసర్‌ పోస్టులు-3, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-29, సీనియర్‌ రెసిడెంట్స్‌-24, ట్యూటర్లు-4 పోస్టులున్నాయి. ఈ పోస్టులను వాకిన్‌ ఇంటర్వ్యూ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.


ఈమేరకు 9న ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 12న ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14న ఎంపిక ప్రక్రియ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను గాంధీ మెడికల్‌ కాలేజీలో వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ వాణి, ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ నియామకాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. నియామకాలు పారదర్శకంగా జరిగేలా హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌లను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సర్కారు జీవో జారీ చేసింది.


  • ఆ ఆస్పత్రుల్లో వైద్యులు పెరిగారు

కాగా వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలతో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నెలకొందన్న వార్తల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ దానిపై స్పష్టతనిచ్చింది. దీర్ఘకాలం ఒకేచోట ఉన్న వారిలో 40 శాతం మందిని బదిలీ చేయాలని జీవో 80 చెబుతోందని, ఆ మేరకే బదిలీలు చేపట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. బదిలీలతో గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ప్రభావం లేదని, ఆ రెండింట్లో గతం కంటే వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ఉన్నారన్నారు.


ఉస్మానియాలో గతేడాది 169 మంది డాక్టర్లు, 247 మంది నర్సులుంటే... ప్రస్తుతం 266 మంది వైద్యులు, 263 నర్సులున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గాంధీలో ఇంతకు ముందు 295 మంది డాక్టర్లు, 191 మంది నర్సులుండగా...ప్రస్తుతం 362 మంది వైద్యులు, 287 మంది నర్సులున్నారని వెల్లడించింది.

Updated Date - Aug 08 , 2024 | 04:49 AM