Share News

Governor Jishnu Devavarma : యాదాద్రి ఓ అద్భుతం

ABN , Publish Date - Aug 28 , 2024 | 05:13 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు.

 Governor Jishnu Devavarma : యాదాద్రి ఓ అద్భుతం

  • ఆధ్యాత్మికత ఉట్టిపడేలా గుడి పునర్నిర్మాణం

  • రామప్ప లాంటి కట్టడాన్ని ఎక్కడా చూడలేదు

  • గిరిజనులు అభివృద్ధి సాధించాలి: గవర్నర్‌

  • యాదగిరిగుట్ట, ములుగులో పర్యటన

యాదాద్రి/ములుగు/గణపురం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు. గవర్నర్‌గా బాఽధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా మంగళవారం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని వేడుకున్నానని చెప్పారు. కాగా, గవర్నర్‌ ఉదయం 8గంటలకు కొండపైకి చేరుకోగా, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎం.హనుమంతరావు, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే స్వాగతం పలికారు.

అక్కడి నుంచి గవర్నర్‌ విష్ణు పుష్కరిణి చేరుకుని వేద మంత్రోచ్ఛరణ నడుమ స్నాన సంకల్పం చేశారు. అఖండ దీపారాధన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం గవర్నర్‌కు మహా మండపంలో వేదమంత్రాలతో వేదాశీర్వచనం చేశారు. 36 నిమిషాలు ఆలయంలో ఉన్న గవర్నర్‌ ఆలయం వెలుపలికి వచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం రోడ్డు మార్గంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనకు బయలుదేరారు. ములుగు జిల్లాలో ఆయనకు మంత్రి ధనసరి సీతక్క, కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ శబరీశ్‌, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేమయ్యారు. మారుమూల గూడాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కంటెయినర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేయించిన మంత్రి సీతక్కను గవర్నర్‌ అభినందించారు. అనంతరం ఆయన జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందిన క్రీడాకారులు, కవులు, విద్యావేత్తలతో కలిసి భోజనం చేశారు.


రామప్పకు మళ్లీ వస్తా..

రామప్ప ఆలయం అత్యద్భుతమైన కట్టడమని, ఇసుక పునాదులపై ఇంత భారీ రాతి నిర్మాణాన్ని చేపట్టడం అప్పటి సాంకేతిక ప్రజ్ఞకు నిదర్శనమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ‘రామప్ప లాంటి సుందరమైన రాతికట్టడాన్ని ఇంతకుమునుపెప్పుడూ చూడలేదు. అందమైన, అద్భుత నిర్మాణమిది. అవకాశం ఉంటే మళ్లీ వస్తా’ అని అన్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికిన పూజారులు.. ఆలయంలో రామలింగేశ్వర స్వామికి గవర్నర్‌తో ప్రత్యేక అర్చన, అభిషేకాలు చేయించి తీర్థప్రసాదాలు, పట్టువస్ర్తాలను బహూకరించారు. అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు.

కఠినమైన శిలలను అందమైన శిల్పాలుగా మలిచిన తీరు ఆశ్చర్యపరిచిందన్నారు. ఆ తర్వాత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కోటగుళ్లను సందర్శించారు. గవర్నర్‌ సాయంత్రం గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువు మధ్య ఐలాండ్‌లోని టూరిజం కాటేజీలో రాత్రి బస చేశారు.

Updated Date - Aug 28 , 2024 | 05:13 AM