Share News

Harish Rao: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ అబద్ధాలు

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:36 AM

సభా నాయకుడి హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను పక్క దోవ పట్టించేలా వ్యవహరిస్తున్న సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతామని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ అబద్ధాలు

  • జవాబు చెప్పలేక తప్పుడు అంశాల ప్రస్తావన

  • ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితమని.. మాట మార్చారు

  • సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతాం

  • మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : సభా నాయకుడి హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను పక్క దోవ పట్టించేలా వ్యవహరిస్తున్న సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతామని బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రుణమాఫీపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, రూ.31వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. అసెంబ్లీ లాబీలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇప్పటికే సభను తప్పుదోవ పట్టించేలా మూడు సార్లు మాట్లాడారని, రేవంత్‌ అబద్ధాలను మీడియా ఎండగట్టాలని సూచించారు.


మేడిగడ్డ దగ్గర కాళేశ్వరంప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్‌ పట్టించుకోలేదంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక ఒకలా ఉంటే సీఎం మరోలా మాట్లాడారని దుయ్యబట్టారు. తాజాగా విద్యుత్‌ మీటర్ల అంశంపై శనివారం తప్పుడు పత్రంతో సభను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఉదయ్‌ ఒప్పందంలో తనకు కావాల్సిన వాక్యాలు చదివి మిగతావి వదిలేశారని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్‌ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం నాటి వైఎస్‌ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు పదవుల కోసం పెదవులు మూసుకున్నామన్న రేవంత్‌ ఆరోపణ వాస్తవం కాదని, అప్పుడు తాము మంత్రులమే కాదని వెల్లడించారు.


అప్పటి ప్రభుత్వం నుంచి బీఆర్‌ఎస్‌ వైదొలగడానికి.. ఇది కూడా ఒక కారణమన్నారు. తమ ప్రశ్నలకు జవాబులు దొరకనప్పుడల్లా సీఎం తప్పుడు అంశాలు ప్రస్తావిస్తూ సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ మాదిరిగా రాజీనామాలు, త్యాగాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరికైనా ఉందా? అని ప్రశ్నించారు. 14 ఏళ్ల ఉద్యమంతో కేసీఆర్‌ తెలంగాణ సాధించకపోతే రేవంత్‌రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుతోనే ఉండే వారని సీఎం, పీసీసీ అధ్యక్ష పదవులు దక్కేవి కాదన్నారు.


‘‘జైపాల్‌రెడ్డి పెద్ద తెలంగాణ వాది.. తాను చిన్న తెలంగాణ వాదిని అన్నట్టుగా రేవంత్‌ గొప్పలు చెబుతున్నారని.. ఆ రోజు తెలంగాణ కోసం 36 పార్టీలను ఒప్పించింది కేసీఆరా? జైపాల్‌ రెడ్డా? తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్‌ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని వ్యాఖ్యానించడం.. రేవంత్‌ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. గతంలో ఎల్‌ఆర్‌ఎ్‌సను ఉచితంగా అమలు చేస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:36 AM