Share News

Harish Rao: తెలంగాణ బుల్డోజర్‌ రాజ్‌పై స్పందించండి

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:48 AM

అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దుర్మార్గ, దుష్ట పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: తెలంగాణ బుల్డోజర్‌ రాజ్‌పై స్పందించండి

  • రేవంత్‌ ఆధ్వర్యంలో నిరంకుశ పాలన

  • చట్టాలను గౌరవించేలా సూచనలు చేయండి

  • రాహుల్‌ గాంధీకి హరీశ్‌ రావు లేఖ

అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ దుర్మార్గ, దుష్ట పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ బుల్డోజర్‌ రాజ్‌పై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ స్పందించాలని కోరుతూ సోమవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘మీ పార్టీ సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న నిరంకుశ పాలనకు బుల్డోజర్‌ ప్రతీకగా మారింది. అది తెలంగాణలో పౌరహక్కులను నిరంతరం ధిక్కరిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్‌ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్థ చర్యలకు పాల్పడుతోంది’’ అని ఆరోపించారు.


ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల మాదిరిగానే.. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ సర్కార్‌ బుల్డోజర్లను ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. భారతరాజ్యాంగంలో పొందుపరచిన సహజ న్యాయసూత్రాలు, చట్టాలను గౌరవించేలా ముఖ్యమంత్రి రేవంత్‌కు సలహా ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆ లేఖలో రాహుల్‌ను కోరారు. కాగా, కాంగ్రెస్‌ తనపై బురదజల్లేందుకు గోబెల్స్‌ ప్రచారాన్ని ఆశ్రయిస్తోందని ‘ఎక్స్‌’ వేదికగా హరీశ్‌ ధ్వజమెత్తారు.


హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో తనకు వాటాలున్నాయంటూ తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎంపీ అనిల్‌కుమార్‌కు లీగల్‌ నోటీసులు పంపినట్లు తెలిపారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి, ఆ పోస్టు తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ.. ఇంతకీ ఆనంద కన్వెన్షన్‌ సెంటర్‌లో హరీశ్‌కు వాటా ఉందో? లేదో చెప్పలేదని వ్యాఖ్యానించారు.హరీశ్‌ ఈ విషయాన్ని దాస్తున్నారంటే.. నిప్పు లేనిదే పొగ రాదు అనుకోవాలా? అని నిలదీశారు.


  • సుందరీకరణ ముఖ్యమా?

ప్రభుత్వానికి పేద ప్రజల బతుకు ముఖ్యమా? మూసీ సుందరీకరణ ముఖ్యమా? హరీశ్‌ ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆటో కార్మికులకు యూనిఫాంలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తే పేద ప్రజల జీవితాలు బాగుపడుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న పేదలు కన్నీరు మున్నీరవుతున్నా.. రేవంత్‌ గుండె కరగడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుతో లక్ష మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా హైడ్రా డ్రామాలను ఆపాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 01 , 2024 | 03:48 AM