Share News

Harish Rao: రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా?

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:22 AM

‘అధికారంలో ఉండగా మొదటి దఫాలో రూ.లక్ష దాకా మేము రుణమాఫీ చేస్తే 35 లక్షల మందికి రైతులకు రూ.17 వేల కోట్లు ఖర్చు అయ్యాయి.

Harish Rao: రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా?

  • 17,869 కోట్లు సరిపోతాయా?

  • మీ రుణమాఫీ పచ్చి అబద్ధం

  • రైతు ద్రోహమే కాదు.. దైవ ద్రోహానికీ పాల్పడ్డ రేవంత్‌: హరీశ్‌రావు

  • ఇంతలా దిగజారిన ముఖ్యమంత్రిని చూడలేదు

  • రైతు రుణమాఫీ మాట తప్పారు : హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉండగా మొదటి దఫాలో రూ.లక్ష దాకా మేము రుణమాఫీ చేస్తే 35 లక్షల మందికి రైతులకు రూ.17 వేల కోట్లు ఖర్చు అయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా...? రూ17,869 కోట్లు మాత్రమే అవుతాయా...?, ఈ ఒక్క విషయంతోనే మీ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోయింది’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దగా చేశారనన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి? అని నేడొక ప్రకటనలో ప్రశ్నించారు.


రేవంత్‌ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదనే విషయం ప్రతీ సందర్భంలోనూ నిరూపితమైందని, ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ చరిత్రలో ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని స్పష్టం చేశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్‌ఎస్‌ మీద, నామీద అవాకులు చెవాకులు పేలారని ఆక్షేపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 9 నాటికి రూ. 40వేల కోట్ల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తామని రేవంత్‌ ప్రకటించారని, దాన్ని నెరవేర్చలేక పార్లమెంట్‌ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపి, ఆగస్టు 15 వరకు రూ.31వేల కోట్లు మాఫీ చేస్తానని ఊదరగొట్టారని గుర్తు చేశారు.


అయినా ఎవరూ నమ్మడం లేదని ప్రతీ ఊరి దేవుడి మీద ప్రమాణాలు కూడా చేశారని విమర్శించారు. రైతు ద్రోహానికే కాకుండా దైవద్రోహానికీ పాల్పడ్డారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి, చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. ‘కానీ ఆ సంస్కారం నీకు లేదు, నీలో ఉన్నది వికారమే తప్ప, సంస్కారం కాదు’ విమర్శించారు. రేవంత్‌ దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నానని పేర్కొన్నారు.


ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పిండో... ఆ దేవుళ్లందరి గుడుల దగ్గరికి త్వరలో తానే వెళ్లి, రేవంత్‌ రెడ్డి చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారొద్దని ఆ దేవుళ్లను ప్రార్థించి వస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల్ని దగా చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం రూ.లక్ష రుణమాఫీకే బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.17 వేల కోట్లు ఖర్చయితే.. ఇప్పుడు రూ.2 లక్షల రుణమాఫీకి రూ.17,900 కోట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Updated Date - Aug 16 , 2024 | 07:58 AM