Share News

Harish Rao: రుణమాఫీ మార్గదర్శకాలు వడపోతకోసమేనా?

ABN , Publish Date - Jul 16 , 2024 | 05:08 AM

రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వడపోతలపైనే దృష్టి పెట్టినట్లు కనబడుతోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు.

Harish Rao: రుణమాఫీ మార్గదర్శకాలు వడపోతకోసమేనా?

  • విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం.. సీఎం క్షమాపణ చెప్పాలి: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వడపోతలపైనే దృష్టి పెట్టినట్లు కనబడుతోందని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఒక మాట, అధికారం చేపట్టాక మరోమాట.. చెప్పేదొకటి, చేసేదొకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. 2018 డిసెంబర్‌ 12వ తేదీకి ముందు అప్పులున్న రైతులకు వర్తించదనే నిబంధన పెట్టడం సరికాదని, ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్‌ పథకం ప్రామాణికమని ప్రకటించడంతో లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్‌ మరో ట్వీట్‌లో తెలిపారు.


గ్రూప్స్‌, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం ఇంత పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘అప్పుడేమో సిటీ సెంట్రల్‌ లైబ్రరీకి రాహుల్‌ గాంధీని తీసుకెళ్లి ఓట్లు కొల్లగొట్టారు. ఇప్పుడదే లైబ్రరీకి పోలీసులను పంపి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారు’ అని ఫైర్‌ అయ్యారు. ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధికి నోచుకోక హైదరాబాద్‌ బ్రాండ్‌ రోజురోజుకు దిగజారిపోతోందని.. రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో కొత్త నాటకానికి తెర తీస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆరోపించారు. జీహెచ్‌ఎంసీతోపాటు శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లలో కాంగ్రె్‌సకు బలం లేనందుకే హైడ్రా పేరుతో పెత్తనం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందన్నారు.

Updated Date - Jul 16 , 2024 | 05:08 AM