Share News

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి..

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:55 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న రూ.2 లక్షల రుణమాఫీ.. రాష్ట్రంలో 54 శాతం మంది రైతులకు అందలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: సీఎం రేవంత్‌ రాజీనామా చేయాలి..

  • 54 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు

  • తొండిలో తోపు.. బూతులు తిట్టడంలో టాప్‌

  • నా క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారు

  • భౌతిక దాడులూ చేస్తారని అనుమానం ఉంది: హరీశ్‌

  • ఎంతమందికి మాఫీ అయిందో తెలుసుకుందాం..

  • తేదీ, స్థలం చెప్పాలంటూ సీఎం రేవంత్‌కు సవాల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న రూ.2 లక్షల రుణమాఫీ.. రాష్ట్రంలో 54 శాతం మంది రైతులకు అందలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రజలను క్షమాపణ కోరడంతోపాటు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని, రాష్ట్రంలో ఎంత మంది రైతులున్నారు, వారిలో ఎంతమందికి ఎన్ని కోట్లు అందించారు, ఎన్ని నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయనే విషయాలను బహిర్గతం చేయాలని అన్నారు.


ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2023 డిసెంబరు 9నాడే రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి.. 2024 ఆగస్టు వరకు పొడిగించారని, అయినా 54 శాతం మంది రైతులకు రుణమాఫీ అందలేదని మండిపడ్డారు. నిజంగా రుణమాఫీ అందరికీ జరిగిందని సీఎం భావిస్తే.. నేరుగా రైతుల వద్దకే వెళ్లి తెలుసుకుందామని, తేదీ, సమయం చెప్పాలని సవాల్‌ చేశారు. ఏ నియోజకవర్గంలోని ఏ గ్రామమైనా పర్వాలేదని, కొడంగల్‌కైనా వెళదామని అన్నారు.


రుణమాఫీ పూర్తి చేశామంటూ తనను రాజీనామా చేయాలంటున్నారని, కానీ.. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని 13 హామీలను సంపూర్ణంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డిలాగా తాను మాట తప్పే వ్యక్తిని కాదని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, పార్టీలు మారిన చరిత్ర తనది కాదని వ్యాఖ్యానించారు.


  • మాఫీపై ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్పారు..

రుణమాఫీపై కాంగ్రెస్‌ పార్టీ ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా చెప్పిందని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.40 వేల కోట్లు అన్నారని, జూన్‌ 21న కేబినేట్‌ భేటీ అనంత రంప్రె్‌సమీట్‌లో రూ.31 వేల కోట్లు అన్నారని, బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు కేటాయించారని, చివరకు 22 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లే మాఫీ చేశారని విమర్శించారు. ఇది కూడా అందరికీ అందలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.లక్ష రుణమాఫీ ప్రక్రియలో 36 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల ప్రయోజనం అందిందని తెలిపారు.


మరి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున మాఫీ చేస్తే.. లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు. రుణమాఫీ అందనివారి వివరాలను తమకు తెలియజేయాలంటూ తెలంగాణ భవన్‌లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తే.. ఈ నెల 6 నుంచి ఇప్పటివరకు 1,16,441 ఫిర్యాదులు వచ్చాయన్నారు. తొండి చేయడంలో రేవంత్‌రెడ్డి తోపు అని, బూతులు తిట్టడంలో టాప్‌ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పరిపాలనలో మాత్రం ఫెయిలయ్యారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా రుణమాఫీ చేస్తామంటూ అక్కడి దేవుళ్లపై ప్రమాణాలు చేశారని గుర్తు చేశారు. వాటిని నెరవేర్చకపోతే ఆ కీడు రాష్ట్రానికి ఎదురుకొడుతుందేమోనని తనకు భయమేస్తోందన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా చూడాలని సీఎంఒట్టు పెట్టిన అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లి మొక్కుకుని, పాప పరిహారం చేస్తానని ప్రకటించారు.


  • నీ గాడ్‌ఫాదర్‌కే భయపడలేదు..

రుణమాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి రైతుల నెత్తిన కాంగ్రెస్‌ టోపీ పెట్టారని హరీశ్‌రావు విమర్శించారు. దానిని పక్కదారి పట్టించేందుకే సీఎం పదవి స్థాయిని దిగజార్చుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతులకు జరిగిన రుణమాఫీ కూడా తమ పోరాటం వల్లనే సాధ్యమైందన్నారు. రైతుల తరఫున పోరాడుతున్నందుకు తమపై గూండాలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంపై దాడి చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలా దాడులు చేయిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.


పరిస్థితులు చూస్తుంటే భౌతిక దాడులకు దిగుతారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. తమ పదేళ్ల పాలనలో ఎప్పుడూ ఇలా దాడులు చేయలేదని చెప్పారు. తాటిచెట్టులా ఉన్నావంటూ తన శారీరక వ్యవహారాల గురించి (బాడీ షేమింగ్‌) వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మిస్టర్‌ రేవంత్‌.. నీ తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నీ గాడ్‌ఫాదర్‌కే భయపడలేదు. రుణమాఫీ విషయంలో మాట తప్పావ్‌.. రైతులందరికీ మాఫీ అయ్యేంతవరకు కాంగ్రె్‌సను, నిన్ను వదిలేది లేదు. బీఆర్‌ఎస్‌ పక్షాన పోరాటం చేస్తాం. మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతాం’’అని హరీశ్‌రావు హెచ్చరించారు.

Updated Date - Aug 18 , 2024 | 03:55 AM